బంగారాలకు బ్రహ్మరథం | grand welcome for rio para olympics heros | Sakshi
Sakshi News home page

బంగారాలకు బ్రహ్మరథం

Published Fri, Oct 28 2016 2:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

grand welcome for rio para olympics heros

► తంగమారికి ’కారు’ కానుక
► వేళమ్మాల్‌లో ‘రియో’ హీరోల సందడి
► దీపిక, దేవేంద్ర, వరుణ్‌లకు సత్కారం
► తలా..రూ.ఐదు లక్షల విలువైన బంగారు నాణేలు
► విద్యార్థులతో ముచ్చట్లు

రియో పారాలింపిక్ బంగారాలు గురువారం చెన్నైలో ప్రత్యక్షమయ్యారు.క్రీడారంగంలో దేశానికి వన్నె తెచ్చిన ఈ హీరోలకు వేళమ్మాల్ విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. తమిళ తంగం మారియప్పన్‌కు కారును బహుకరించారు. మరో బంగారం దేవేంద్ర జజారియా, వెండి సింగారం దీపామాలిక్, కాంస్య కెరటం వరుణ్ సింగ్ బాటీలకు తలా రూ. ఐదు లక్షల విలువైన బంగారు నాణేలను అందజేశారు. విద్యార్థులతో ముచ్చటించిన పారా పతకాల ధీరులు తమ క్రీడానుభవాలను పంచుకున్నారు. - సాక్షి, చెన్నై
 
సాక్షి, చెన్నై: చెన్నైలోని వేళమ్మాల్ విద్యాసంస్థ యాజమాన్యం క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు సాగుతున్నదని చెప్పవచ్చు. భారతదేశంలో ఏ క్రీడాకారుడైనా సరే ఉత్తమ ప్రతిభను కనబరిస్తే చాలు సత్కరిస్తూ, తమ వంతుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నది. ఆ దిశలో తమిళ తంగం మారియప్పన్ తంగవేలు పారాలింపిక్స్‌లో బంగారం చేజిక్కించుకోవడంతో తమ విద్యాసంస్థకు ఆహ్వానించి గతవారం ఘనంగా సత్కరించారు. ఇక, ఇదే ఒలింపిక్స్‌లో బంగారం, వెండి, కాంస్య పతకాలతో దేశానికి గర్వకారణంగా నిలిచిన మరో ముగ్గుర్ని కూడా సత్కరించుకునేందుకు ఆ యాజమాన్యం నిర్ణయించింది.ఇందుకుగాను గురువారం మధురవాయిల్ సమీపంలోని ఆలపాక్కం క్యాంపస్ ఆవరణ వేదికగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

హైజంప్‌లో బంగారంతో మెరిసిన మారియప్పన్ తంగవేలు, ఎఫ్-46 జావెలిన్ త్రోలో తన రికార్డును తానే బద్దలు చేస్తూ, కొత్త చరిత్ర సృష్టించిన దేవేంద్ర జజరియా, షాట్‌పుట్‌లో వెండి సింగారంతో తొలి భారతీయ మహిళగా ఘనత సాధించిన దీపామాలిక్, హైజంప్‌లో కాంస్యంతో సత్తా చాటిన వరుణ్ సింగ్ బాటి ఉదయాన్నే ఆలపాక్కంకు చేరుకోగానే, వేళమ్మాల్ విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. మేళ తాళాల నడుమ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటే విధంగా ఆహ్వానం పలికారు.  జాతీయ పతాకాన్ని చేత బట్టి పారా రియో హీరోలను ఆహ్వానిస్తూ, తమ విద్యా సంస్థల్లోకి తీసుకెళ్లారు. అక్కడి వేదికపై జరిగిన వేడుకలో పూలమాలలతో, పూల కిరీటాలతో ఘనంగా సత్కరించారు. క్రీడాస్ఫూర్తిని చాటే పాటలతో ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాకారులను అభినందనలో ముంచెత్తారు.
 
తంగంకు కారు : రియోలో తంగంతో మెరిసిన రాష్ట్రానికి చెందిన మారియప్పన్ తంగవేలుకు ఆ విద్యా సంస్థ యాజమాన్యం రూ. ఆరు లక్షలు విలువగల రెనాల్ట్ కై ్వడ్ కారును బహూకరించింది. దేశ గౌరవాన్ని పెంచడంలోనే కాదు, తమిళ ఖ్యాతిని రియోలో చాటిన తంగంను ఈ సందర్భంగా విద్యార్థులు అభినందనలతో ముంచెత్తారు. ఆ విద్యా సంస్థ చైర్మన్ వేల్ మురుగన్  కారు తాళంను మారియప్పన్‌కు అందజేశారు. అలాగే, మిగిలిన ముగ్గురు హీరోలను బంగారాలతో సత్కరించారు. ఒకొక్కరికి రూ. ఐదు లక్షలు విలువల బంగారు నాణేలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా క్రీడ కారుల రియో విజయకేతనాన్ని వివరిస్తూ ప్రత్యేకంగా వీడియో ప్రజంటేషన్‌ను ప్రదర్శించడం విశేషం. ఈ సమయంలో ఇక్కడి విద్యార్థుల కేరింతలకు హద్దే లేదు. క్రీడాకారులకు విద్యార్థులు, విద్యార్థులకు క్రీడాకారులు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే, విద్యార్థులతో రియో హీరోలు ముచ్చటించారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ప్రతి రోజూ ఓ పండుగే: దీపామాలిక్ విద్యార్థులతో ముచ్చటిస్తూ, వేళమ్మాల్‌లో తమను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.  ప్రోత్సాహం అన్నది ఉంటే చాలు, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగగలమని, మరిన్ని పతకాలను సాధించగలమన్నారు. ఈ వయస్సులో కూడా తాను ప్రతిభను చాటుకోవడంతో పతకం దక్కిందని, ఇది తనకు ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందని వ్యాఖ్యానించారు.  ప్రతిరోజూ పండుగే అని, ఆనందోత్సాహలతో ప్రతిరోజును పరిగణించాలని ఓ విద్యార్థి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

క్రమశిక్షణ, కృషి , పట్టుదల  ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగలమన్న భావనతో ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రీడాకారుడు అడుగు పెట్టిన, సత్కారం అందుకున్న వేళమ్మాల్ విద్యాసంస్థ వేదికలో, తాను కూడా సత్కారం పొందడం జీవితంలో  లభించిన అదృష్టంగా భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.  జీవితంలో ఏదైనా సాధించాలంటే, వైకల్యం అడ్డు కాదు అని, కృషి, పట్టుదల, సాధన ఉంటే చాలు అంటూ, ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఉదాహరణగా రియోలో పతకాలు సాధించిన తమ నలుగుర్ని ఉద్దేశించి సమాధానం ఇచ్చారు.

మారియప్పన్ మాట్లాడుతూ తన తల్లి, సోదరుడు, సోదరి ప్రోత్సాహం, తన స్వగ్రామంలోని ప్రతి ఒక్కరూ అందించిన సహకారం, పాఠశాల, కళాశాల స్థాయిలో లభించిన ఆదరణతో పాటు కోచ్ ఇచ్చిన సాధనతో తాను ఈ పతకాన్ని సాధించినట్టు వివరించాడు. దేవేంద్ర మాట్లాడుతూ తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. దివ్యాంగుడు అన్న భావనను వీడాలని, ఎంతటి విజయాన్ని అయినా సాధించగలమన్న ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వరుణ్‌సింగ్ బాటీ మాట్లాడుతూ ఏదైనా సాధించ గలనన్న దృక్పథంతో శ్రమించానని, అందుకు ఫలితం గా పతకం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం 80 చ.అడుగులతో ఆ విద్యా సంస్థ విద్యార్థులు రియో పారాలింపిక్‌లోని క్రీడల్ని ఎత్తి చూపుతూ సిద్ధం చేసిన పెరుయింటింగ్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ విద్యా సంస్థ ప్రిన్‌‌సపాల్ జయంతి రాజగోపాలన్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement