‘డ్యాం’ పటిష్టం
సాక్షి, చెన్నై:ముల్లై పెరియార్ డ్యాంపై సర్వ హక్కులను తమిళనాడు కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ హక్కుల్ని కాలరాయడం లక్ష్యంగా కేరళ ప్రయత్నాల్లో మునిగింది. డ్యాం బలహీనంగా ఉందని ఆరోపిస్తూ, ప్రత్యామ్నాయంగా మరో డ్యాం నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అయితే, కేరళ సర్కారుపై తమిళనాడు ప్రభుత్వం ఏళ్ల తరబడి కోర్టులో చేస్తూ వచ్చిన పోరాటానికి ఇటీవల ఫలితం దక్కింది. ఆ డ్యాం పటిష్టంగానే ఉందని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆ డ్యాంలో నీటి మట్టాన్ని 136 అడుగుల నుంచి 142 అడుగులకు పెంచుకునే విధంగా తీర్పు వెలువడింది. తమ చిరకాల కోరిక నెరవేరడంతో ఆ డ్యాం నీటి ఆధారిత తేని, శివగంగై, మదురై, రామనాథపురం, విరుదనగర్ జిల్లాల్లోని అన్నదాతలు ఆనందంలో ఉన్నారు. అదే సమయంలో డ్యాం నీటి మట్టాన్ని పెంచేందుకు తగ్గ పనుల్ని రాష్ట్ర ప్రజా పనుల శాఖ వేగవంతం చేసింది. కేంద్ర నీటి పారుదల శాఖ ఇంజనీరు ఎల్‌ఏవీ నాథన్ నేతృత్వంలో పర్యవేక్షణా కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీ ఆ డ్యాంను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమగ్ర నివేదికను సిద్ధం చేసే పనిలో పడింది. ఆ డ్యాంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండడం, ఆ డ్యాం స్థిరత్వం పూర్తి స్థాయిలో పరిశీలనల్లో ఆ కమిటీ మునిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం తమ పరిశీలనానంతరం డ్యాం సురక్షితం అని నాథన్ ప్రకటించారు.
కేరళలో కురుస్తున్న వర్షాలతో ముల్లై పెరియార్ డ్యాంలోకి నీటి రాక పెరుగుతున్నది. దీంతో 133 అడుగులకు చేరువు అవుతోంది. మరి కొద్ది రోజుల్లో ఈశాన్య రుతు పవనాల సీజన్ రానుండడంతో మరింతగా కేరళలో వర్షాలు పడితే ఆ డ్యాం నీటి మట్టం త్వరలో 140 అడుగులకు చేరడం ఖాయం. దీంతో ఆ డ్యాం స్థిరత్వాన్ని సమగ్రంగా పరిశీలించడంలో నాథన్ కమిటీ నిమగ్నం అయింది. పరిశీలనను ముగించినానంతరం అధికారులతో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. డ్యాంలోకి వస్తున్న నీటి శాతం, జల విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం విడుదల అవుతోన్న నీటి శాతం, అన్నదాతలకు పంపిణీ చేస్తున్న నీటి శాతం, డ్యాంలో నిల్వ ఉన్న నీటి శాతం తదితర వివరాలపై సమీక్షించారు. డ్యాం పరిసరాల్లో లీకేజీలు ఏమైనా ఉన్నాయా, గేట్ల పటిష్టత తదితర అంశాలపై చర్చించుకున్నారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నాథన్ డ్యాం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. చిన్న చిన్న లీకేజీలు సర్వ సాధారణం అని, వాటి వలన డ్యాంకు ఎలాంటి ముప్పు లేదని వివరించారు. మరికొద్ది రోజుల్లో డ్యాం నీటి మట్టం 140 అడుగులకు చేరే అవకాశం ఉందన్నారు. తదుపరి అక్టోబరు 10 -20 తేదీ మధ్య మరోమారు పరిశీలన జరపనున్నామన్నారు.
దారాదత్తం : పెరియార్ డ్యాం పరిసరాల్లో ముల్లైకుడి, తేని కుడి, పలమాకుడి ప్రాంతాలు ఉన్నాయి. ఈ మార్గాల గుండా సైతం వర్షపు నీరు డ్యాంలోకి వస్తోంది. ఈ ప్రాంతాలన్నీ తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. అయితే, ప్రస్తుతం ముల్లై కుడి పూర్తిగా కేరళ ఆధీనంలోకి వెళ్లటం పరిశీలనలో వెలుగు చూసింది. డ్యాం పర్యవేక్షణా కమిటీ పరిశీలన, కేరళ అధికారులు ఇస్తున్న సమాచారాలతో ఈ విషయం బయట పడింది. ఇది వరకు ముల్లై కుడి లో వర్ష పాత నమోదు నిమిత్తం పరికరాలను ప్రజా పనుల శాఖ ఏర్పాటు చేసింది. ఇది వరకు వారానికో రోజు అధికారులు అక్కడికి వెళ్లి వచ్చే వారు. అయితే, ఇటీవల కాలంగా ముల్లైకుడిని తమిళ అధికారులు మరచి పోవడంతో, అది కాస్త ప్రస్తుతం కేరళ రాష్ట్ర అటవీ శాఖ గుప్పెట్లోకి వెళ్లిపోయింది. మళ్లీ ముల్లైకుడిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఎలాంటి పోరాటం తమిళ అధికారులు చేయాల్సి వస్తుందోనన్నది వేచి చూడాల్సిందే.