ముంబైకి పొంచివున్న ముప్పు | Heavy Rain Continues In Mumbai For Second Day | Sakshi
Sakshi News home page

ముంబైకి పొంచివున్న ముప్పు

Published Sat, Jun 29 2019 2:13 PM | Last Updated on Sat, Jun 29 2019 3:34 PM

Heavy Rain Continues In Mumbai For Second Day - Sakshi

సాక్షి, ముంబై: వరుసగా రెండో రోజూ ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రైళ్లు, విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది. దాదర్‌, వాదాలా, వర్లీ, చెంబూర్‌, బాంద్రా, అంధేరీ, కంజూర్‌మార్గ్‌, పాస్కల్‌వాడి, వర్సోవా, యారీ రోడ్‌, మడ్‌జెట్టీ తదితర ప్రాంతాల్లో నీరు ఎక్కువగా నిలబడిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రానున్న 24 గంటల్లో ముంబైతో పాటు కొంకణ్‌లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముంబై వాసులు వణుకుతున్నారు.

కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు ఘట్‌కోపర్‌ ప్రాంతంలో భవనం, చెంబూరులో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. సియన్‌ కోలివాడలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. థానేలో కరెంట్‌ షాక్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముంబై తూర్పు సబర్బన్‌లో గత 24 గంటల్లో 197 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు బీఎంసీ వెల్లడించింది. నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్‌ మానుకోవాలని ప్రజలకు సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో మ్యాన్‌హోల్స్‌ను తెరవద్దంటూ బీఎంసీ నగరవాసులను కోరింది. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం మ్యాన్‌హోల్స్‌ వద్ద రక్షణ గ్రిల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపింది. శనివారం తెల్లవారుజామున పుణెలోని కొంద్వా ప్రాంతంలో ఉన్న తలాబ్ మసీదు వద్ద గోడ కూలిన దుర్ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

నలుగురు మృతి...
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో నలుగురు మృతిచెందారు. ముంబైలో ముగ్గురు షార్ట్‌సర్క్యూట్‌ కారణఃగా మరణించగా ముంబైకీ సమీపంలోని పాల్ఘర్‌ జిల్లాలో పిడుగు పడి ఒకరు మరణించారు. ముంబైతోపాటు ఉప నగరాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో 9 ప్రాంతాల్లో షార్ట్‌ సర్క్యూట్‌ ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో పశ్చిమ గోరేగావ్‌లోని ఇరవానీ ఇస్టేట్‌లో ఏర్పడ్డ షార్ట్‌ సర్క్యూట్‌లో నలుగురికి గాయలయ్యాయి. అయితే వీరిని ఆసుపత్రికి తరలించగా రాజేంద్ర యాదవ్‌ (60), సంజయ్‌ యాదవ్‌ (24)లు ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. అయిదేళ్‌ల ఆశాదేవి దీపూ యాదవ్‌ (24)లు చికిత్స పొందుతున్నారు. పశ్చిమ అంధేరీ ఆర్‌టీఓ కార్యాలయం ఎదురుగా ఉదయం 7.48 గంటలకు వర్షం కారణంగా షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడింది. దీంతో కాశీమా యుడియార్‌ అనే 60 ఏళ్ల వృద్ధ మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది.
 
పాల్ఘర్‌ జిల్లాలో..
పాల్ఘర్‌ జిల్లాలో పిడుగు పడి ఓ ఎనిమిదేళ్ల మహేంద్ర బడగా అనే బాలుడు మరణించాడు. విక్రమగడ్‌ తాలూకాలోని సాతాకోర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలతో ఇంటి బయట ఆడుకుంటుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పిడుగు పడింది. దీంతో తీవ్ర గాయాలైన మహేంద్రను ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement