హోరు వాన
బెంగళూరు: ఉద్యాననగరిని వాన ముంచెత్తింది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మొదలైన ఈ వర్షం సుమారు రెండున్నర గంటల పాటు జోరుగా కుసిరింది. నగరంలోని ఇందిరానగర్, శివాజీనగర్, శాంతినగర, బీటీఎం లేఅవుట్‌తోపాటు మెజిస్టిక్ తదితర ప్రాంతాల్లో వదర నీరు రోడ్లపై ప్రవహించింది. వర్షానికి ఈదురుగాలులు సైతం తోడవడంతో కొన్ని చోట్ల వృక్షాలతోపాటు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ఎంజీ రోడ్, బ్రిగెడ్ రోడ్, ఇన్‌ఫ్రాంట్రీ రోడ్, సీఎంహెచ్ రోడ్ తదితర ప్రాంతాలన్నింటిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. గంటలపాటు ట్రాఫిక్‌జామ్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఇక బీబీఎంపీ నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో కలిసి పొంగిపొర్లాయి. దీంతో నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం నిలిచిన తర్వాత ప్రజాపనుల శాఖ, బెస్కాం, బీబీఎంపీ తదితర శాఖల సిబ్బంది వర్షం కారణంగా కూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నేడు (ఆదివారం) కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.