అసెంబ్లీలో ప్రతినిధులు అడుగు పెట్టడం లక్ష్యంగా తమిళనాట విస్తృత పర్యటనకు కమలం పెద్దలు సిద్ధమయ్యారు.
రంగంలోకి కేంద్ర మంత్రులు
నేడు తిరుచ్చికి అమిత్ షా
భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం
కదిలిన ప్రచార రథాలు
అసెంబ్లీలో ప్రతినిధులు అడుగు పెట్టడం లక్ష్యంగా తమిళనాట విస్తృత పర్యటనకు కమలం పెద్దలు సిద్ధమయ్యారు. ఐదుగురు కేంద్ర మంత్రుల ఎన్నికల ప్రచార పర్యటన రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. ఇక సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఇక, తమిళనాట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సిద్ధమయ్యారు. తిరుచ్చి వేదికగా బుధవారం అభ్యర్థులను పరిచయం చేయనున్నారు.
చెన్నై : రాష్ట్రంలో చిన్న పార్టీలతో కలసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధ పడ్డ విషయం తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకునే విధంగా ఎన్నికల్లో కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన 90 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆయా అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నంలో దూసుకెళుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టడం లేదా, తమ ప్రతినిధులు ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టడం లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి కమలం పెద్దలు సిద్ధమయ్యారు. తమిళనాడు మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారు.
రంగంలోకి పెద్దలు : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తమిళనాట ప్రచారానికి ఇప్పటికే సిద్ధమయ్యారు. తమకు గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్ని గురి పెట్టి వీరి ప్రచారం సాగేందుకు తగ్గ కార్యచరణ సిద్ధం అవుతున్నది. ఇక, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గట్కారి, సృతి ఇరాని, వెంకయ్య నాయుడు, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ ఇక తమిళనాట తిష్ట వేయనున్నారు. పదే పదే వీరి ప్రచార పర్యటనకు సాగబోతున్నాయి. ఇందుకు తగ్గ ప్రచార రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది.
అలాగే, బీజేపీ ఎంపీ హేమమాలిని కొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో పర్యటించేందుకు నిర్ణయించి ఉన్నారు. బీజేపీఅధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, ఉపాధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ పోటీ చేయనున్న నియోజకవర్గాలు హేమామాలిని ప్రత్యక ఆకర్షణగా నిలవబోతున్నారు.
నేడు అమిత్ షా రాక : తమిళనాట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిద్ధమయ్యారు. బుధవారం తిరుచ్చి వేదికగా ఆయన ప్రచార బహిరంగ సభ జరగనున్నది. బీజేపీ, మిత్ర పక్షాల అభ్యర్థులను ఈ వేదిక మీద నుంచి ఓటర్లకు ఆయన పరిచయం చేయనున్నారు. అమిత్ షా రాక కోసం తిరుచ్చి మన్నార్ పురం ఆర్మీ మైదానం సిద్ధమైంది. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌షాకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. అక్కడి నుంచి రేస్ కోర్స్ రోడ్డులోని ఎస్‌ఆర్‌ఎం హోటల్‌కు అమిత్ షా చేరుకుంటారు.
మిత్ర పక్షాల నాయకులు, అభ్యర్థులతో సమావేశం అవుతారు. సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా రాకతో భారీ జన సమీకరణ దిశగా బీజేపీ వర్గాలు పరుగులు తీసి ఉన్నాయి. ఇక, బీజేపీ ఎన్నికల ప్రచార రథాలు చెన్నై నుంచి మంగళవారం కదిలాయి.
ఎల్‌ఈడీ స్క్రీన్లతో కూడిన యాభై ప్రచార రథాలను బీజేపీ సిద్ధం చేసింది. తాంబరంలో జరిగిన కార్యక్రమంలో ఎనిమిది ప్రచార రథాలను జెండా ఊపి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీ ధరరావు సాగనంపారు. కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, తదితరులు పాల్గొన్నారు.