సీఎం సిట్టింగ్ స్థానంలో హిజ్రా పోటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరంగా అనేక సంచలనాలకు నిలయంగా మారిన తమిళనాడులో మరో విశేషం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి 'పురచ్చితలైవి' జయలలిత ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఓ హిజ్రా పోటీకి దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
సేలం దేవీ అనే హిజ్రాను ఆర్కే నగర్ నుంచి పోటీకి దింపుతున్నట్లు తమిళనాడుకు చెందిన 12 స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు మంగళవారం ప్రకటించాయి. నామ్‌తమిళర్ కట్చి(ఎన్‌టీకే) తరఫున పోటీకి దిగుతోన్న సేలం.. గడిచిన కొన్నేళ్లుగా హిజ్రాల హక్కుల కోసం పోరాడుతున్నారు. కుల, మత భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు ప్రభుత్వం అనేక రాయితీలు, పథకాలు అమలు చేస్తుండగా హిజ్రాలు మాత్రం వివక్షకు గురవుతున్నారని, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించేందుకు ఇకపై జరుగనున్న ఎన్నికల్లో హిజ్రాలకు రాజకీయ రిజర్వేషన్లు, పోటీచేసే అవకాశం కల్పించాలని ఎన్ టీకే డిమాండ్ చేస్తోంది.