బెంగళూరు, న్యూస్‌లైన్: అభివృద్ధి పనుల్లో నాణ్యత ఎంత డొల్లగా ఉందో మేయర్ కట్టె సత్యనారాయణ తనిఖీల్లో బట్టబయలైంది. ఓ ప్రాంతంలో నిర్మించిన డ్రెయినేజీ వాల్స్‌ను ఆయన కాలితో తన్ని పరిశీలించగా అవి కుప్పకూలాయి. దీంతో ఆయన కాంట్రాక్టర్‌పై ఆగ్రహోద్యులయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మైసూరు రోడ్డులో జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులను పరిశీలించారు.
సిర్శి సర్కిల్ నుంచి బీహెచ్‌ఇఎల్ వరకు జరిగిన పనులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫుట్‌పాత్‌ల వద్ద నిర్మిస్తున్న డ్రెయినేజీ పనులు పరిశీలించారు. కాలితో ఒక్క సారి తన్నితే అవి పడిపోయాయి. దీంతో అక్కడే ఉన్న కాంట్రాక్టర్, పనులు పరిశీలిస్తున్న ఇంజనీర్లును మేయర్ ఛీవాట్లు పెట్టి హెచ్చరించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో తాము ముక్కుమూసుకొని వెళ్లాల్సి వస్తోందని స్థానికులు మేయర్ దృష్టికి తెచ్చారు. రోడ్డు పక్కనే మల మూత్రాలను గుర్తించి వెంటనే ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గుంతమయమైన రోడ్డును మరమ్మతులు చేయాలని సూచించారు.
పనులు పూర్తి చేసేందుకు ఇచ్చిన నాలుగు నెలల గడువు పూర్తయ్యిందని, నవంబర్‌లోపు పనులు పూర్తి చేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. రోడ్ల పనులతో పాటు బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ, బెస్కాం పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట బీబీఎంపీ భారీ పనుల స్థాయి సమితి అధ్యక్షుడు సోమశేఖర్, పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత డొల్ల
Published Sat, Sep 21 2013 4:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement
Advertisement