
భార్యను 22 సార్లు కత్తితో పొడిచాడు
మైసూరులో కిరాతకం
మైసూరు : మైసూరులో కలకలం రేగింది. ఓ కిరాతకుడు భార్యను అత్యంత క్రూరంగా కత్తితో పొడిచి పొడిచి చంపడం సంచలనం రేపింది. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉండే నగరవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
మైసూరు నగరంలో మేటిగెహళ్ళి నివాసి గోపాల్‌కు విద్యారణ్యపురకు చెందిన దీపా(25)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో మద్యం చిచ్చు రేపింది. కొంత కాలంగా మద్యానికి బానిసైన గోపాల్ నిరంతరం భార్యతో గొడవపడి చావబాదేవాడు. భర్త వేధింపులు తాళలేక దీపా పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం రాత్రి పీకల దాక మద్యం తాగిన గోపాల్ దీపా ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు.
వెంట తెంచుకున్న కత్తితో దీపాపై 22 సార్లు అమానుషంగా పొడిచి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన దీపా అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో విద్యారణ్యపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు గోపాల్ కోసం గాలింపు చేపట్టారు.