బెంగళూరు : ఏదేని బస్సు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రంలో రవాణా, పోలీసు శాఖలు ముమ్మర దాడులతో హంగామా చేయడమే తప్ప.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లే దు.
ఈ విషయంలో ఈ రెండు శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సోమవారం జరిగిన ‘కళాసిపాళ్య’ వంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. బస్సులు, రైళ్లు తదితర ప్రజా రవాణా వాహనాల్లో మందుగుండు, రసాయనాలను
తీసుకెళ్లడానికి వీలులేదు. అయితే బెంగళూరు నుంచి ఇతర నగరాలకు వెళ్లే చాలా బస్సుల్లో పెయింట్ డబ్బాలు, టపాకాయల తయారీకి వాడే మందు తదితర పదార్థాలు నిత్యం రవాణా అవుతున్నాయి. జబ్బార్, నేషనల్ ట్రావెల్స్ ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి బస్సు డిజైన్లతోపాటు అందులో తీసుకువెళ్తున్న మండే స్వభావం గల పదార్థాలూ కారణమని తెలిసింది. అయితే ఈ రెండు ట్రావెల్సూ రాజకీయ పలుకుపడి కలిగిన వ్యక్తులవి కావడంతో ఆ బస్సుల్లో పేలుడు పదార్థాలు ఉన్న విషయం బయటకు రాకుండా అటు రవాణాశాఖ, ఇటు పోలీసు అధికారులే అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ రెండు ఘటనలు జరిగిన తర్వాత పదిరోజుల పాటు రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులపై ముమ్మరంగా దాడులు చేసి.. కేసులు నమోదు చేశారు. ఆపై మిన్నుకుండిపోయారు. దీంతో బస్సుల్లో మళ్లీ పేలుడు పదార్థాలు యథావిధిగా రవాణా అవుతూనే ఉన్నాయి. ‘కళాసిపాళ్య’ సంఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.
అదే నిర్లక్ష్యం ...
కళాసిపాళ్య బస్ స్టేషన్‌లో పోలీసు శాఖ కనీస భద్రతా చర్యలు కూడా పాటించడం లేదు. ఈ బస్‌స్టేషన్ నుంచి నిత్యం దాదాపు 35 వేల మంది ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రమాదం జరిగిన చోటకు కొన్ని అడుగుల దూరంలోనే పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. అయితే గోనెసంచిలో చుట్టి ఉన్న పదార్థం పేలిన తర్వాత కానీ పోలీసులు అప్రమత్తం కాలేదు. బెంగళూరు నగరంపై ఉగ్రవాదుల కన్ను ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంతోపాటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా పోలీసు శాఖ ఇలా నిద్రావస్థలో ఉండటం పలు విమర్శలకు తావిస్తోంది.