
అంత సీన్ లేదు
ప్రతి నాయకీగా నటించేంత పరిణితి చెందలేదని, తనకు అంత సీన్ లేదని నటి భాను పేర్కొంది. తామర భర్ణి చిత్రంలో విశాల్‌కు జంటగా పరిచమైన ఈ మలయాళీ భామ ఆ చిత్రంలో కాస్త కురచగా, మరికాస్త బొద్దు, ముద్దుగా అందర్నీ అలరించింది. అయితే, ఆ తర్వాత ఈమె హీరోయిన్ గ్రాఫ్ ఏ మాత్రం ఎదగలేదు. అందుకు కారణం కుటుంబ సమస్యలు కూడా కావచ్చు. ఏది ఏమైనా ఈ మధ్య భాను మళ్లీ కోలీవుడ్‌లో అవకాశాలను రాబట్టుకుంటోంది.
అయితే ఆర్య, తమన్న జంటగా నటిస్తున్న వాసువుం...శరవణన్‌ను...ఎన్న పడిచ్చవంగ... చిత్రంలో హాస్యనటుడు సంతానం సరసన ప్రతినాయకీగా నటిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై భాను స్పందిస్తూ, ఆ చిత్రంలో ఆర్య, సంతానం ప్రాణ స్నేహితులుగా నటిస్తున్నారన్నారు. తాను సంతానం భార్యగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఎప్పుడు ఆర్యను వెంటబెట్టుకు ఉండే సంతానం చర్యల్ని ఖండించే పాత్ర తనదిగా వివరించారు. అలాంటి పాత్ర ప్రతినాయకీ ఎలా అవుతుందని ప్రశ్నించింది.
ప్రస్తుతం మలయాళంలో యూటు...బ్రూటస్ అనే చిత్రంతో పాటుగా మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. తమిళంలో పీవీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న శంకుతలావిన్ కాదలన్ చిత్రంలో తాను హీరోయిన్‌గా నటిస్తున్నట్టు పేర్కొంది. అదే విధంగా పాంబు చండై చిత్రంలో బాబి సింహాకు వదినగా నటిస్తున్నట్టు తెలిపింది. ఇలా నాయకీగా చిత్ర కథను మలుపు తిప్పే పాత్రలు పోషించడానికి తాను ఎప్పడు సిద్ధమేనని , అయితే, ప్రతి నాయకీగా నటించి మెప్పించే పరిణితి తాను ఇంకా పొందలేదని పేర్కొంది.