పెళ్లి పేరుతో వంచన తల్లి అయిన బాలిక
ప్రేమ.. ఈ పేరుతో అమాయక బాలికలను, యువతులను వంచిస్తున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. ఇటువంటి సంఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చినా వాటికి అడ్డుకట్ట పడడం లేదు.. అభం శుభం తెలియని ఓ బాలికను ప్రేమ పెళ్లి పేరుతో మభ్య పెట్టి తల్లిని చేశాడో యువకుడు.. తర్వాత పెళ్లి చేసుకోను పొమ్మన్నాడు.. నాలుగు నెలల పసికందుతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఆ అభాగ్యురాలిని బాలికా సంరక్షణ కేంద్రం చెంతకు చేర్చుకుంది..
మల్కన్‌గిరి : పెళ్లి చేసుకుంటానని బాలికను మభ్యపెట్టి గర్భవతిని చేశాడు అతను.. గర్భవతి అని తెలియడంతో పెళ్లికి ససేమిరా అన్నాడు.. దీంతో అటు పుట్టింటికి, ఇటు పెళ్లి చేసుకుంటానన్న వాడికి దూరమై నాలుగు నెలల చిన్నారితో రోడ్డున పడిందో బాలిక. అమ్మ చాటున ఉండాల్సిన ఆ అమ్మాయి అమ్మగా మారింది.. మల్కన్‌గిరి జిల్లా ఖొయిర్‌పుట్ సమితి బోండా ఘాటీ పరిధిలోని బండిగుడ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. బాధితురాలి కథనం ప్రకారం...
బండిగుడ గ్రామంలో బొండా జాతికి చెందిన ఓ కుటుంబంతో అదే గ్రామానికి చెందిన అనాథ యువకుడికి పరిచయమైంది. ఆ ఇంటికి నిత్యం రాకపోకలు సాగించడంతో ఆ ఇంట్లోని బాలికతో పరిచయం ఏర్పడింది. బాలికతో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మభ్యపెట్టి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో బాలిక గర్భవతి అయింది.. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు బాలికను ఇంట్లో నుంచి బయటకు పంపేశారు. గర్భవతిని చేసిన వాడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో గ్రామంలోనే ఉంటూ నాలుగు నెలల కిందట ఒక మగశిశువుకు జన్మనిచ్చింది.
గ్రామంలో ఏ విధమైన చేయూత లేకపోవడంతో ఒంటరిగా బతుకు బండి సాగించాలని నిర్ణయించుకుని మల్కన్‌గిరి చేరుకుంది. పసికందును చంకన వేసుకుని తనకు పని కావాలని వీధుల్లో తిరుగుతోంది. పసికందుతో బాలికను గమనించిన స్థానికులు మంగళవారం సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ అధికారులు మల్కన్‌గిరి పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై చర్య తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. సీడబ్ల్యూసీ అధికారి సంయుక్త ప్రదాన్ మాట్లాడుతూ, బాలికకు న్యాయం జరిగేవరకు తమ సంరక్షణలోనే తల్లీశిశువు ఉంటారని చెప్పారు. శిశువు సంరక్షణ బాధ్యత తమదేనని చెప్పారు.