ప్రేమ...పెళ్లి...పరారీ!
♦ ప్రేమ పేరిట మోసం
♦ పెళ్లి చేసుకున్న రెండేళ్ల తరువాత పరారైన భర్త
♦ న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకోలు
ప్రేమించానని నమ్మించి...పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఓ వ్యక్తి రెండేళ్లు పాటు కలిసి జీవించి నేడు మోసం చేసి పరారయ్యాడని ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధి పనుల్లో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరిట నయవంచన చేశాడని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని వేడుకొంది. వివరాల్లోకి వెళ్తే...
సాలూరు(విజయనగరం జిల్లా): రెండేళ్ల కిందట ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, పెళ్లి చేసుకుని, కాపురం చేసిన భర్త నేడు పరారయ్యాడని, వెదికి అప్పగించాలంటూ పట్టణ పరిధిలోని గుమడాంకు చెందిన దళిత మహిళ సింగారపు సుమతి వేడుకున్నారు. మంగళవారం సుమతి తన తల్లి శాంతమ్మ, భారతీయ రిపబ్లిన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప ప్రకాశరావుతో కలసి విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ రెండేళ్ల కిందట తాను ఉపాధి కోసం గుడివాడలోని ఉమా స్పిన్నింగ్ మిల్లులో పనిలో చేరానన్నారు. అక్కడ పని చేస్తోన్న శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యట్లబాసివలసకు చెందిన చిట్టి అరవింద్(బీసీ) తనను ప్రేమిస్తున్నానని, నీవు ప్రేమించకపోతే చనిపోతానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది.
దేవాలయంలో వివాహం చేసుకుని ఆపై మోహన్ స్పిన్ టెక్‌మిల్లులో తన భార్యగా చెప్పి పనిలో చేర్పించి, ఆరు నెలలు అద్దె ఇంట్లో కాపురం పెట్టాడన్నారు. ఆపై పెద్దల సమక్షంలో వివాహం చేసుకుందామని చెప్పి సాలూరులోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి, పెద్దల సమక్షలో ఈ ఏడాది జనవరి 28న విశాఖలోని శ్రీవినాయకరామ శివాలయంలో వివాహం చేసుకున్నాడన్నారు. అపై గుడివాడ తీసుకువెళ్లి, కొద్ది రోజుల తర్వాత వదిలి పారిపోయాడని న్యాయం చేయాలని కోరారు.
అనంతరం గొంప ప్రకాశరావు మాట్లాడుతూ ఈ విషయమై ఈ నెల 11న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసామని, దీంతో అరవింద్ ఇంటికి వెళ్లిన పోలీసులకు సర్పంచ్ ఇంటిలో అరవింద్‌ను దాచేసి, తర్వాత అప్పగిస్తామని తిప్పి పంపారన్నారు. దళిత మహిళను మోసం చేయాలని చూస్తోన్న అరవింద్‌కు మరో వివాహం చేయాలని చూస్తున్నారని, అందువల్ల నిందితుడితో పాటు అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.