సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి సరెండర్ అయిన ఓ జిల్లా స్థాయి ఉన్నతాధికారిని.. మంచి పోస్టింగ్ ఇప్పిస్తానని ఓ నకిలీ ఉన్నతోద్యోగి నమ్మబలికి రూ.3 లక్షలు వసూలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారమంతా ఫోన్లోనే సాగగా.. లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారా జరిగాయి. అనుమానం వచ్చిన సదరు అధికారి, బ్యాంకు అధికారులకు ఫోన్‌చేసి చెల్లింపు నిలిపివేయాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటికే సొమ్ము విత్ డ్రా అయినట్లు గుర్తించిన బ్యాంకు సిబ్బంది ఖాతాదారు ఇంటికి వెళ్లారు. అక్కడ ఖాతాదారుణ్ణి కూలి పనులు చేసుకునే ఒక మహిళగా గుర్తించారు. కానీ, ఈ బాగోతమంతా ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ నడిపిస్తున్నట్లు తెలుసుకుని అతని నుంచి సొమ్మును రికవరీ చేశారు. కానీ, నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. బాధితుడు ప్రకాశం జిల్లాలో డీఎం అండ్ హెచ్‌ఓగా పనిచేసిన బి. వినోద్‌కుమార్.
క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించిన ఈ ఘటన వివరాలివీ.. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామానికి చెందిన రోజూ వారి కూలీ చింతల పద్మకు గత కొన్ని నెలలుగా ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి. ఆమె భర్త ప్రసాద్ వచ్చిన డబ్బులు వచ్చినట్లు విత్‌డ్రా చేసి తన మిత్రుడు నారాయణరావుకు అందించేవాడు. ఇలా రూ.10 లక్షల వరకు పద్మ ఖాతా ద్వారా లావాదేవీలు జరిగాయి. గతేడాది జూలై 15న రూ. 20 వేలతో మొదలైన వ్యవహారం ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన రూ.3 లక్షలు జమ అయ్యే వరకు సాగింది. కాగా, గురువారం పద్మతోపాటు ఆమె భర్త ప్రసాద్ అంపోలు ఆంధ్రాబ్యాంకుకు వచ్చారు. రెండు లక్షలు విత్‌డ్రా చేశారు. పద్మ ఖాతాలోకి సొమ్ము బదిలీ చేసిన ప్రకాశం జిల్లా పూర్వ డీఎం అండ్ హెచ్‌ఓ బి.వినోద్ కుమార్ కొద్ది నిమిషాల్లోనే ఆంధ్రాబ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
‘పొరపాటున నా నగదు పద్మ ఖాతాలోకి వెళ్లింది. దయచేసి రికవరీ చేయాల’ని ఆయన సమాచారం అందించారు. వెంటనే స్పందించిన బ్యాంకు మేనేజర్ సురేష్ తన సిబ్బంది సహకారంతో పద్మ ఇంటికి వెళ్లగా, డబ్బులు తనవి కావని, ఆర్‌ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న నారాయణరావుకు చెందినవని సమాధానం చెప్పారు. ఆ సొమ్మును ఇప్పుడే అతనికి ఇచ్చేశామని ప్రసాద్ చెప్పడంతో బ్యాంకు సిబ్బంది అవాక్కయ్యారు. గ్రామంలోనే ఉంటున్న నారాయణరావును వెంటనే పట్టుకుని నగదు రికవరీ చేశారు. నారాయణరావు ఎవరని తెలుసుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. నారాయణరావు బాగోతమేంటి? వీరి వెనక ఎవరున్నారు? ఇలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారు? అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment