పెళ్లి వాహనం బోల్తా...పది మంది దుర్మరణం
దావణగెరె, న్యూస్‌లైన్ : పెళ్లి వేడుక ముగించుకుని వెనుతిరిగిన పెళ్లి బృందం ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది. వారు ప్రయాణిస్తున్న క్యాంటర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో పది మంది అక్కడికక్కడే మృతి చెందగా, దాదాపు 25 మందికి పైగా గాయపడిన ఘటన దావణగెరె జిల్లాలోని హొన్నాళి తాలూకా న్యామతి పోలీసు స్టేషన్ పరిధిలోని తుగ్గలహళ్లి గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది.
పోలీసుల వివరాల మేరకు... జిల్లాలోని హరిహర తాలూకా భానువళ్లి గ్రామం నుంచి హొన్నాళి తాలూకా రామేశ్వర గ్రామంలోని తీర్థరామేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన వివాహ వేడుక ముగించుకుని క్యాంటర్ వాహనంలో తిరిగి భానువళ్లికి వస్తుండగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హొన్నాళి తాలూకా తుగ్గలహళ్లి వద్ద ఏటవాలుగా ఉన్న రోడ్డులో వేగంగా వస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. మృతులను భానువళ్లికి చెందిన హనుమంతరెడ్డి(62), కే.మహేశ్వరప్ప(62), డీజీ మహదేవ గౌడ(60), పూజార్ నాగప్ప(55), వీరభద్రప్ప(55), సంతోష్‌కుమార్(25), మురళీ(9), హనుమంతప్ప (55), నాగరాజు (50), రవి (30)గా గుర్తించారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 25 మందిని సమీపంలోని శివమొగ్గ, దావణగెరె ఆస్పత్రులకు తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని హొన్నాళిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి క్యాంటర్ డ్రైవర్ అజాగ్రత్తే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డ్రైవర్ తమ మాట వినకుండా వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ఇలా ఉండగా ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడమేగాకుండా, చికిత్స కోసం ఆర్థికసాయం కూడా చేసి ఆదుకున్నారు. హొన్నాళి ఆస్పత్రికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఘటన స్థలానికి డీఎస్పీ నాగరాజ్, సీఐ నాగరాజ్ మాడళ్లి, ఎస్‌ఐ కుమారస్వామిలతో పాటు సిబ్బంది చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై న్యామతి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.