ఐదేళ్ల తరువాతే పెళ్లి | i will marry After five years says Sanjana Singh | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తరువాతే పెళ్లి

Published Fri, Feb 20 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

ఐదేళ్ల తరువాతే పెళ్లి

ఐదేళ్ల తరువాతే పెళ్లి

ఐదేళ్ల తరువాతనే పెళ్లి అంటున్నారు నటి సంజనా సింగ్. 2009లో తమిళంలో రేణిగుంట చిత్రం ద్వారా ప్రాచుర్యం పొందిన ఈ ముంబయి భామ ఆ తరువాత వరుసగా విభిన్న పాత్రల్లో తమిళ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఈ నెల 23న తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గోవాలో పుట్టిన రోజును జరుపుకోనున్న సంజనా సింగ్ గురువారం ఉదయం చెన్నైలో పాత్రికేయుల సమక్షంలో ముందుగానే బర్త్‌డే కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కింది విధంగా బదులిచ్చారు.
 
 ప్రశ్న: ముందుగానే బర్‌‌తడే జరుపుకోవడానికి కారణం?
 జవాబు: రేణిగుంట చిత్రం నుంచి చిత్ర పరిశ్రమ వర్గాలతో పాటు మీడియా ఎంతగానో సహకరిస్తోం. అలాంటి పత్రికల వారిని కలవాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. అందుకు ఇది సరైన సమయంగా భావించాను. నా పుట్టిన రోజును ఈ నెల 23న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గోవాలో జరుపుకోనున్నాను.
 
 ప్రశ్న : నటిగా కెరీర్ ఎలా ఉంది?
 జవాబు: చాలా ప్రోత్సాహంగా ఉంది. విభిన్న పాత్రలు పోషించి నటిగా తానేమిటో నిరూపించుకునే అవకాశం కలుగుతోంది.
 
 ప్రశ్న: తమిళంలోనే స్థిరపడాలని భావిస్తున్నారా?
 జవాబు: తమిళ చిత్రాలకు ప్రాధాన్యత నిస్తున్నమాట నిజమే అయినా తెలుగు, హిందీ, కన్నడం అంటూ అన్ని భాషలలోనూ నటించి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.
 
 ప్రశ్న: నటి నమితను పోటీగా భావిస్తున్నారా?
 జవాబు: అందులో నిజం లేదు. నేను ఎవరినీ పోటీగా భావించడం లేదు. ఇంకొకరితో పోటీ పడటం గానీ, ఇతరులను అనుకరించడం గానీ నా కిష్టం ఉండదు. నేను సంజనగానే ఉండాలనుకుంటున్నాను.
 
 ప్రశ్న: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
 జవాబు: ఇటీవల హిందీలో ఒక చిత్రం చేశాను. తమిళంలో మానే తేనే పేయే చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నాను. త్వరలో తెలుగులో కూడా నటించనున్నాను.
 
 ప్రశ్న: త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా?
 జవాబు: ఆహా హా... అవన్నీ వదంతులే. ప్రస్తుతం నాకలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు నా దృష్టి అంతా నటనపైనే. చాలెంజ్ అనిపించే పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకోవాలి.
 
 ప్రశ్న: ఇటీవల హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి బాత్రూమ్ సన్నివేశాలను ఇంటర్‌నెట్‌లో పోస్టు చేసే సంస్కృతి అధికం అవడం గురించి?
 జవాబు: ఇది నిజంగా చాలా బాధాకరం. అలాంటి కారకాలకు పాల్పడే వారు తమకు అక్కాచెల్లెళ్లు ఉన్నారని, హీరోయిన్లు తమలాంటి మనుషులేనని విషయాన్ని గుర్తించుకోవాలి.
 
 ప్రశ్న: పెళ్లెప్పుడు చేసుకుంటారు?
 జవాబు: నటిగా చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. సంజన మంచి నటి అనే గుర్తింపు పొందాలి. అందువలన మరో ఐదేళ్ల వరకు పెళ్లి ప్రసక్తే లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement