దేనికైనా సిద్ధం | If you forget the cedar, prepare it for yourself | Sakshi
Sakshi News home page

దేనికైనా సిద్ధం

Published Tue, Aug 15 2017 5:53 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

దేనికైనా సిద్ధం

దేనికైనా సిద్ధం

ప్రభుత్వాన్ని కూల్చం
►  ‘అంతా’ ఒక్కటే
హైజాక్‌కు ప్రయత్నిస్తే.. ఉపేక్షించను
కేడర్‌ను విస్మరిస్తే.. ఊరుకోను
తలచుకుని ఉంటే, ఎప్పుడో సీఎం అయ్యేవాడిని
కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుదాం
దినకరన్‌ పలుకులు
అమ్మ మరణంపై న్యాయ విచారణకు వేడుకోలు
బల నిరూపణ


కేడర్‌ను విస్మరిస్తే.. దేనికైనా సిద్ధం అని సీఎం పళని స్వామి నేతృత్వంలోని మంత్రివర్గాన్ని టీటీవీ దినకరన్‌ హెచ్చరించారు. అన్నాడీఎంకే గొడుగు నీడలో ఉన్నవాళ్లు అందరూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. అయితే, పార్టీని దొడ్డిదారిన హైజాక్‌ చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించనన్నారు. అమ్మ ప్రభుత్వం కొనసాగాలన్న కాంక్షతో తాను ముందుకు సాగనున్నట్టు తెలిపారు. చిన్నమ్మ తలచుకుని ఉంటే, ఎప్పుడో సీఎం అయ్యే వారని స్పందించారు. జైలుకు వెళ్తూ, తనను సీఎం చేసి ఉండే వారంటూ పేర్కొన్నారు.

సాక్షి, చెన్నై :  పదవులపై తనకు, తన కుటుంబానికి ఆశ లేదని టీటీవీ దినకరన్‌ చెప్పారు. దివంగత నేతలు ఎంజీయార్, అమ్మ జయలలిత చేతుల మీదుగా మహా శక్తిగా అవతరించిన అన్నాడీఎంకేను రక్షించుకోవడం బాధ్యత అని మదురైలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ నియామకం చెల్లదంటూ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని శిబిరం తేల్చడం ఆ పార్టీలో ఉత్కంఠ రేపింది.  ఈ నేపథ్యంలో మదురై వేదికగా సోమవారం సాయంత్రం దినకరన్‌ ఎంజీయార్‌ శత జయంతి బహిరంగ సభకు పిలుపునివ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

దినకరన్‌ వెన్నంటి ఎంత మంది ఎమ్మెల్యేల నడవనున్నారు? తదుపరి ఆయన అడుగులు ఎలా ఉంటాయో? అన్న చర్చ బయలుదేరింది. సీఎం పళని స్వామిని గద్దెదించే ప్రయత్నాలు సాగబోతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. అయితే, వీటన్నింటికి తెరదించుతూ, అన్నాడీఎంకేలో అందరూ ఒక్కటేనని, అయితే, పార్టీని హైజాక్‌ చేయడానికి ప్రయత్నిస్తే సహించబోనని దినకరన్‌ హెచ్చరికలు చేయడం గమనార్హం. అలాగే, ప్రభుత్వాన్ని కూల్చబోమని, అమ్మ ప్రభుత్వం కొనసాగాలన్న కాంక్షతో బలోపేతం వైపుగా సాగనున్నామన్నారు. అదే సమయంలో కేడర్‌ను ఉపేక్షిస్తే మాత్రం దేనికైనా సిద్ధం అని హెచ్చరించారు.

ఎప్పుడో సీఎం అయ్యేవాడిని
కరుణానిధిని సీఎంను చేసిన ఘనత ఎంజీయార్‌కే దక్కిందని దినకరన్‌ వ్యాఖ్యానించారు. అయితే, ఎంజీయార్‌కు కరుణాని«ధి తీవ్ర ద్రోహంచేశారని, అందుకే అన్నాడీఎంకేతో ఆయనకు గట్టి గుణపాఠం చెప్పినట్టు గుర్తుచేశారు. తిన్నింటి వాసాలు లెక్క పెడితే, ప్రజలు ఉపేక్షించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా సీఎం పళని స్వామికి ఈసందర్భంగా హెచ్చరికలు చేశారు. ఎంజీయార్‌ మరణంతో రెండుగా చీలిన పార్టీని మహాశక్తిగా నిలబెట్టడం అమ్మ జయలలిత ఘనత అని వ్యాఖ్యానించారు.

అమ్మ మరణం తదుపరి పరిణామాలను గుర్తుచేస్తూ, త్యాగ తల్లి చిన్నమ్మ శశికళ తలచుకుని ఉంటే, డిసెంబరు ఐదోతేదీ రాత్రే సీఎంగా పగ్గాలు చేపట్టి ఉండేవారని తెలిపారు. ఆమెకు పదవులు ఇష్టం లేదని, అమ్మ ప్రభుత్వం కొనసాగాలన్న కాంక్షతో ఒకర్ని సీఎం చేస్తే, ఆయన మరొకరి(డీఎంకే) చేతిలో ప్రభుత్వాన్ని పెట్టే ప్రయత్నం చేశారని పన్నీరు సెల్వంను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. ఈ కుట్రల్ని భగ్నం చేయడం లక్ష్యంగా చిన్నమ్మ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అయితే, పరిస్థితులు అనుకూలించని దృష్ట్యా, ఆ సమయంలో ప్రమాదవశాత్తుగా పళని సీఎం అయ్యారని ఎద్దేవాచేశారు.  ఈ సమయంలో చిన్నమ్మ తలచుకుని ఉంటే, తాను సీఎం అయ్యేవాడినని, అయితే, ఆ ఆశ తనకు గానీ, తన కుటుంబానికి గాని ఎన్నడూ లేదని స్పష్టంచేశారు.

అమ్మ మరణంపై న్యాయ విచారణ
30 మంది కలిస్తే పార్టీ కాదు అని, కోటిన్నర మంది మనోగతం ముఖ్యం.. అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎంకు హెచ్చరికలు చేశారు. అమ్మ పాలన కొనసాగుతుందని, ఇది మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి తనవల్ల ఎన్నడూ రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తన వద్దకు వచ్చే ఎమ్మెల్యేలందరూ వారి మదిలోని మనోగతం, ఆవేదనను చెప్పుకుంటున్నారని వివరించారు. అంతేగానీ, తలుపులు మూసుకుని, ఫోర్జరీ సంతకాలు, తీర్మానాల ద్వారా పార్టీని హైజాక్‌ చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించనని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.

కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుదామంటూ, ప్రజాహితాన్ని కాంక్షించే పథకాల అమలుతో అమ్మ సుపరిపాలనను అందిద్దామని పిలుపునిచ్చారు. అమ్మ మరణంలో అనుమానాలు అంటూ ఆ పెద్దాయన(పన్నీ రు) డిమాండ్‌ చేస్తున్నారని గుర్తుచేస్తూ, ఆయన అభీష్టం మేరకు న్యాయ విచారణకు ఈ ప్రభుత్వం ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు. విచారణకు ఆదేశిస్తే, ముందుగా విచారణను ఎదుర్కొనబోయేది ఆయనేనని, ఈ విచారణలకు తాము భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణ కైనా సిద్ధం అని స్పష్టం చేశారు.

కేడర్‌ను అణగదొక్కడం మానుకోండి
తమకు పదవుల ఆశ లేదన్న విషయం తెలిసిన కొందరు మూర్ఖులు, ఇప్పుడు తామేదో ప్రమాదాన్ని సృష్టించబోతున్నట్టుగా ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. ఆ రోజున కూవత్తురులో చిన్నమ్మ క్యాంప్‌ పెట్టకుండా ఉండి ఉంటే, ఈరోజు పదవుల్లో ఉండే వారా..? అని పళని సర్కారును ఉద్దేశించి ప్రశ్నించారు. ఓమారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అధికారం చేతిలోకి రాగానే,  గర్వం నెత్తికెక్కినట్టుందని, పద్ధతి మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఎంజీయార్‌ శత జయంతికి తరలి వస్తున్న వాళ్లను అడ్డుకోవడం, ఎమ్మెల్యేని కిడ్నాప్‌ చేయడం బట్టి చూస్తే, ఏమేరకు దిగజారి వ్యవహరిస్తున్నారో అంటూ, ఇదో సిగ్గు చేటుగా అభివర్ణించారు. కోల్పోయిన చిహ్నం కైవశం,  పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బలోపేతం వైపుగా అడుగులు వేయకుండా, ఆ 30మంది తలుపులు మూసుకుని నిర్ణయాలు తీసుకోవడం శోచనీయమని విమర్శించారు. కేడర్‌కు వ్యతిరేకం, ఎమ్మెల్యేలను అణగదొక్కే రీతిలో వ్యవహరించడం మానుకుంటే మంచిదని మంత్రులకు హితవు పలికారు. కేడర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకోని పక్షంలో తాను దేనికైనా  సిద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తాను ‘420’ అన్న పదాన్ని సంతాకాల విషయంగా ప్రయోగిస్తే, గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజం తడుముకున్నట్టుగా సీఎం పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement