కటకటాల్లో 'కలకలం'
► బాస్‌పైనే డీఐజీ రూప సమరశంఖం
► అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజం
► పరప్పన అగ్రహార సెంట్రల్ జైలే వివాద కేంద్రం
► గొడవ ఎక్కడికెళ్తుందోనని ఉత్కంఠ
► సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం
సీనియర్ల మాటను జవదాటని పోలీసు శాఖలో ఇది సంచలనమే. ఒక సీనియర్‌ను మరో జూనియర్ ఐపీఎస్ సవాల్ చేశారు. ఏకంగా అవినీతి ఆరోపణలనే సంధించారు. జైళ్లశాఖ డీఐజీ రూప మౌద్గిల్... ఆ శాఖ చీఫ్ సత్యనారాయణపై ముడుపుల ఆరోపణలతో నివేదికను సర్కారుకు పంపడం కలకలం రేపుతోంది. పరప్పన జైల్లో చిన్నమ్మ శశికళకు ప్రత్యేక వసతుల కోసం రూ.2 కోట్లు చేతులు మారాయని రూప స్పష్టంచేయడం వ్యవహారం తీవ్రతను చాటుతోంది.
సాక్షి, బెంగళూరు: జైలంటే ‘తప్పుచేసిన వారిని సన్మార్గంలో నడిపించే పరివర్తన కేంద్రం’, కానీ ఈ స్ఫూర్తి కాగితాలకే పరిమితమన్నది మరోసారి స్పష్టమైంది. అక్కడ గంజాయి మొదలుకొని మద్యపానం, సెల్‌ఫోన్‌లు వాడటం, దాడులు,దౌర్జన్యాలు వంటివి సాధారణంగా మారిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఆరోపణలు పై స్థాయిలోని అధికారిపై రావడం మాత్రం సంచలనం రేపుతోంది. ఇందులో అనేక పెద్ద తలకాయలు ఉండడంతో విషయం ఎక్కడికి వెళ్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు లోపల అనేక అక్రమాలు జరుగుతున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ రూప మౌద్గిల్ ఆ శాఖ డీజీపీ సత్యనారాయణరావ్, ప్రభుత్వానికి నివేదిక పంపడం కలకలం రేపుతోంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు ప్రత్యేకవసతులు కల్పించడానికి ఆ ఉన్నతాధికారి రూ.2కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆమె నివేదికలో లిఖితపూర్వకంగా ఆరోపించడం గమనార్హం.
వైద్య సిబ్బందిపై ఖైదీల దాడులతోనే రట్టు!
పరప్పన అగ్రహార కేంద్ర కారాగృహంలో జరుగుతున్న అక్రమాలు బయటికి రావడానికి ప్రధాన కారణం అక్కడి వైద్య సిబ్బంది పై ఖైదీలు దాడికి పాల్పడం అని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల కొందరు ఖైదీలు వైద్య సిబ్బంది తమ మాట వినలేదని కొట్టారు. దీనిని జైలు వార్డర్లు చూసినా పట్టించుకోలేదు. ఫిర్యాదులు చేస్తే ఉన్నతాధికారులకు ఇబ్బందులకు గురవుతారని వైద్యులను బుజ్జగించారు. దీంతో వైద్యులను ఖైదీలు హేళన చేయడం మొదలైంది. ఈ నేపథ్యంలో వైద్యులు తమ గోడును డీఐజీ రూపాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పరప్పనఅగ్రహార జైలు ఉన్నతాధికారులకు డీఐజీ రూప ఆదేశించారు. అయితే సమాధానం రాకపోవడంతో ఆమే స్వయంగా ఈ నెల 10న తనిఖీకి వెళ్లడం వ్యవహారాన్ని మలుపు తిప్పింది. జైల్లోని సంగతులపై తాజా నివేదికను రూపొందించారు.
ఇది కూడా కారణమా?
రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు, అలాగే జూనియర్ ఐఏఎస్‌లు– ఐపీఎస్‌లకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ ఐజీపీగా సత్యనారాయణ ఆ శాఖలో తాను ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలను, పథకాలను డీఐజీ రూప తనవేనని ప్రచారం చేసుకుంటున్నారని భావిస్తున్నారు. ఈ క్రమంలో పై నుంచి ఆమెకు రెండు మెమోలు కూడా వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే డీఐజీ రూప పరప్పన జైల్‌పై వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్రమాలపై గళమెత్తారని ఆ శాఖ వర్గాల కథనం.
పనిచేస్తే.. మెమో ఇస్తారా? – జైళ్ల డీఐజీ రూప
నివేదికలో డీఐజీ రూప కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘జైళ్ల శాఖ డీఐజీగా నేను జూన్ 23న బాధ్యతలు స్వీకరించాను. విధుల్లో భాగంగా ఈనెల 10న నేను పరప్పన జైలుకు వెళ్లాను. ఆ తరువాతి రోజే మీ (సత్యనారాయణ) కార్యాలయం నుంచి నాకు మెమో వచ్చింది. అందులో ‘మిమ్ములను పరప్పన అగ్రహార జైలుకు ఎవరు వెళ్లమన్నారు’ అని ప్రశ్నించారు. నా అధికార పరిధి ప్రకారం జైళ్లకు వెళ్లి తనిఖీ చేయడం, తప్పు చేసినసిబ్బంది నుంచి వివరణ కోరడం కూడా నా విధి. నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటే మీరు మెమో జారీ చేయడం అత్యంత శోచనీయం’ అని ఘాటుగా పేర్కొన్నారు.
డీఐజీ రూప వైఖరి సరికాదు
రాయచూరు రూరల్ : బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ, స్టాంపుల కేసు దోషి తెల్గీ నుంచి జైళ్ల శాఖ ఐజీపీ సత్యనారాయణరావు ముడుపులు తీసుకుని రాచమర్యాదలు చేస్తున్నారని ఆ శాఖ డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన గురువారం రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా తొండిహాళ్‌లోని హెలిప్యాడ్ వద్ద విలేకరులతో మాట్లాడారు. డీజీపీ సత్యనారాయణ జైళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని డీఐజీ రూప మీడియా ముందు బహిరంగంగా చెప్పడం తగదని సూచించారు. ఈ విషయంపై హోం శాఖ కార్యదర్శితో చర్చించి పరప్పనజైలు వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మళ్లీ కరువు ఛాయలు
రాష్ట్రంలో కాంగెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.40 వేల కోట్లను నీటిపారుదల రంగానికి కేటాయించామన్నారు. గత బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.18 వేల కోట్లను మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని జాతీయబ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను రద్దు చేసేలా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, విధాన పరిషత్ ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్‌లు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి ఒత్తిడి చేయాలన్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తరపున ముందు జాగ్రత్త చర్యగా మేఘ మథనం చేపడతామన్నారు. బీజేపీ నాయకులు 2018 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కంటున్న కలలు కల్లలు కాక తప్పదన్నారు.