సెంట్రల్ జైల్లో దొరికిన మారణాయుధాలు
కర్ణాటక, బనశంకరి: బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలంటే ఎంతో భద్రత కలిగిన కారాగారం. కానీ జైల్లో కత్తులు, సిగరెట్లు, గంజాయి తదితరాలు సులభంగా చేరిపోతున్న వైనం మరోసారి బయటపడింది. జైల్లో బుధవారం సీసీబీ పోలీసులు చేసిన దాడుల్లో వీటితో పాటు మొబైల్ సిమ్‌కార్డులు దొరికాయి. పలువురు ఖైదీల వద్ద, సెల్‌లలోను, బాత్రూంలు, రహస్య ప్రాంతాల్లో ఇవి లభించాయి. పరప్పన అగ్రహార జైలు నుంచి కొందరు ఖైదీలు నగరంలో నేర కార్యకలాపాలను తమ అనుచరుల ద్వారా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ నేతృత్వంలో జైలులో సోదాలు చేశారు. పలువురు ఖైదీలు దాచుకున్న 37 చాకులు,డ్రాగర్లు, గంజాయి, గంజాయి తాగే పైపు లు, మొబైల్‌సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఎలా వెళ్తున్నాయి
బెంగళూరు నగరంలో రౌడీ కార్యకలాపాల అణచివేతకు అప్పుడప్పుడు జైలులో తనిఖీలు చేస్తామని సందీప్‌పాటిల్ తెలిపారు. జైలులో ఉన్న బెంగళూరు రౌడీలను విచారిస్తున్నట్లు తెలిపారు. జైలులో స్వాదీనం చేసుకున్న వస్తువులు, సిమ్‌కార్డులు గురించి జైలులో ఉన్న ఉన్నతాధికారులతో సమాచారం సేకరిస్తున్నామని సందీప్‌పాటిల్ తెలిపారు. పరప్పన జైలులో ఎంతమంది సిబ్బందితో కాపలా పెట్టినా ఖైదీలు, రిమాండు ఖైదీలు సెల్‌ఫోన్ల ద్వారా నగరంలో నేర కలాపాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జైలు సిబ్బంది కుమ్మక్కు కావడంతో సులభంగా మొబైళ్లు, గంజాయి, కత్తులను కూడా లోపలికి వెళ్లిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు పేరుమోసిన ఖైదీలు జైలులో ఉంటూ మొబైల్ ద్వారా అండర్‌వరల్డ్ డాన్‌లతో సంప్రదింపులు జరుపుతున్నారు. జైల్లో ఉండి నేరాలు చేయిస్తే సాక్ష్యాధారాలు దొరకవని నేరగాళ్ల ధీమా.
Comments
Please login to add a commentAdd a comment