గుంతకల్లు, న్యూస్‌లైన్ : రైల్వే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ మనోజ్‌జోషి వెల్లడించారు. శుక్రవారం డీఆర్‌ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన 144వ డీఆర్‌యూసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 11 సెక్షన్లు ఉండగా, ఆయా సెక్షన్ల పరిధిలో 1304.71 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉందన్నారు.
ఇందులో ఏ-1 రైల్వేస్టేషన్ ఒకటి ఉండగా ‘ఏ’ క్లాస్ రైల్వేస్టేషన్లు ఆరు, ‘బీ’ క్లాసు రైల్వే స్టేషన్లు ఎనిమిది, ‘డి’ క్లాసు రైల్వేస్టేషన్లు పది, ‘ఈ’ క్లాసు రైల్వే స్టేషన్లు తొంబై ఒకటి, ‘ఎఫ్’ రైల్వేస్టేషన్లు పదిహేడు రైల్వేస్టేషన్లు ఉన్నాయన్నారు. ఏటా గుంతకల్లు రైల్వే డివిజన్ 200 నుంచి 250 కోట్ల రుపాయలు ఆదాయం ఆర్జిస్తోందన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 227.62 కోట్ల రుపాయలు ఆదాయం రాగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 276.86 కోట్ల రుపాయలు ఆదాయం వచ్చిందన్నారు.
ప్రయాణీకుల ఆదాయం పెంచే విషయంలో, సౌకర్యాలు కల్పించేందుకు సీనియర్ డీసీఎం స్వామినాయక్‌తోపాటు డీసీఎం రఘునాథరెడ్డిలు చక్కని ప్రయత్నాలు చేశారన్నారు. గూడ్స్ రవాణా ద్వారా 2012-13లో రూ.472.22 కోట్లు, 2013-14లో రూ.486.60 కోట్లు ఆదాయం లభించిందన్నారు. సండ్రీ ఎర్నింగ్స్, ఇతర కోచింగ్ ద్వారా 47.74 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా ఆదాయం ఆర్జించామన్నారు. ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు.
రైల్వే డివిజన్ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతోపాటు టాయ్‌లెట్లు, తాగునీటి సౌకర్యం కల్పించడానికి, వసతీ గదులు ఏర్పాటుకు ప్రయత్నాలు విస్తృతం చేశామన్నారు. ప్రయాణీకుల కోసం కోట్లాది రుపాయలతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే 38 పనులు పూర్తి అయ్యాయన్నారు. మరో 106 పనులు చకచకా సాగుతుండగా, అదనంగా చేపట్టిన 147 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయన్నారు. ఇదే సమయంలో కొన్ని రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచగా, మరికొన్ని రైళ్లకు అదనపు స్టాపింగులు ఇచ్చామన్నారు. కొన్ని రైళ్లు పొడగింపులు కూడా రైల్వేబోర్డు ఇచ్చినట్లు చెప్పారు.
ఇక డీఆర్‌యూసీసీ సభ్యులు అడిగిన విధంగా కొన్ని వినతులు పరిగణనలోకి తీసుకుని పరిష్కరించగా, మరికొన్నింటికి రైల్వేబోర్డు అనుమతి అవసరమన్నారు. త్వరలోనే సభ్యులు అడిగిన డిమాండ్లను రైల్వేబోర్డు దష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌యూసీసీ మెంబర్లు జవహర్‌జైన్(రాయచూర్), ఎం.రామ్‌జీ ( ధర్మవరం), ఓంప్రకాష్‌యాదవ్ (తాడిపత్రి), కాటమయ్య( అనంతపురం), పీవీ శేషారెడ్డి( తిరుపతి), జి.రామయ్యపిళ్లై( తిరుపతి), ఏ.గిరిధర్(గుత్తిఆర్‌ఎస్), విజయ్‌శంకర్(తిరుచానూర్, చిత్తూరు), ఎం.జనార్దన్‌రెడ్డి(నంద్యాల), వి. సుంకప్ప(గుంతకల్లు), జి.వెంకటరమణ( తిరుపతి), ఎస్.రమణ (మదనపల్లి), బి.నాగేంద్ర(అనంతపురం)లతోపాటు ఏడీఆర్‌ఎం సత్యనారాయణ, పలువురు రైల్వే డివిజన్ అధికారులు పాల్గొన్నారు.
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
Published Sat, Dec 28 2013 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement