సీఎస్‌కేపై నిషేధంతో రూ.350కోట్లకు గండి
నిషేధంపై అభిమానుల ఆవేదన
ఐపీఎల్‌కు సీఎస్‌కేనే బలమని వ్యాఖ్య
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఐపీఎల్ క్రికెట్ తో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)పై జస్టిస్ లోథా కమిటీ రెండేళ్ల నిషేధం విధించడం అభిమానులను ఆవేదనకు గురిచేసింది. అలాగే రెండేళ్ల నిషేధం వల్ల సీఎస్‌కే ఆదాయానికి *350కోట్ల గండిపడింది.
తమిళనాడు క్రికెట్ క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొట్టిన సీఎస్‌కే భారత కెప్టెన్ ధోనీ నాయకత్వంలో అనతికాలంలో రాణించింది. 2010, 2011లో వరుసగా రెండుసార్లు ఐపీఎల్ కప్పు గెలిచింది. అలాగే నాలుగుసార్లు (2008, 2012, 2013, 2015) రెండవ స్థానంలో నిలిచింది. 2014లో సైతం ప్లేఆఫ్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో పోటీలో అప్రతిహతంగా దూసుకుపోతున్న సీఎస్‌కే 2013లో అపఖ్యాతిని మూటగట్టుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో సీఎస్‌కే ఫ్రాంచైజీ బెట్టింగ్ కుంభకోణానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై జస్టిస్ లోధా కమిటీ రెండేళ్లపాటూ విచారణ చేపట్టింది.
ఆరోపణలు రుజువైనందున సీఎస్‌కేపై రెండేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు లోథా కమిటి తీర్పుచెప్పడంతో అభిమానులు కుంగిపోయారు. చెన్నైకి చెందిన థోనీ వీరాభిమాని శరవణన్ నామమాత్ర వస్త్రాలు ధరించి మిగిలిన శరీరమంతా పసుపు రంగు పూసుకుంటాడు. సీఎస్‌కే అనే అక్షరాలకు తోడు ధోనీ నంబరు 7ను వంటిపైన ముద్రించుకుంటాడు. సీఎస్‌కే టీం ఎక్కడ ఆడినా ఆ మైదానానికి చేరుకుని ఉత్సాహ పరుస్తాడు. సీఎస్‌కేపై రెండేళ్ల నిషేధంపై అతను మాట్లాడుతూ నిషేధం వార్త వినగానే తల్లిదండ్రులు కోల్పోయినట్లుగా బాధ కలిగింది, సీఎస్‌కే లేని ఐపీఎల్‌ను ఊహించలేము అన్నారు. పసుపు రంగు ఒంటికి పూసుకోకుండా ఎలా బతికేది, నా జీవితం సీఎస్‌కేకు అంకితం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో కొందరు చేసిన తప్పుకు మొత్తం సీఎస్‌కే పైనే నిషేధం విధించడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఫ్యాషన్ డిజైనర్ కృష్ణ మాట్లాడుతూ సీఎస్‌కే టీం క్రీడాప్రపంచానికే గర్వకారణమని, సీఎస్‌కే లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను చూడరని అన్నారు. ధోనీ, రైనా లేకుండా ఐపీఎలే లేదని ఆయన ఆ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
రూ.350 కోట్లకు గండి:
ఇదిలా ఉండగా, సీఎస్‌కేపై రెండేళ్ల నిషేధం వల్ల రూ.350 కోట్ల ఆదాయానికి గండిపడింది. ప్రకటనల రూపేణా, వివిధ ఉత్పత్తుల అమ్మకాలు తదితరాల ద్వారా ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు రూ.160 కోట్లు నుండి రూ.180 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. రెండేళ్ల నిషేధంతో కనీసం రూ.350 కోట్ల ఆదాయానికి గండిపడినట్టేనని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. బెట్టింగ్ కుంభకోణం వల్ల ఏడాదిపాటు నిషేధం పడుతుందని భావించాం, రెండే ళ్ల నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని సీఎస్‌కే ముఖ్యుడొకరు చెప్పారు.
సుప్రీంలో అప్పీలు చేస్తాం
Published Thu, Jul 16 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM
Advertisement
Advertisement