కాస్త టైమివ్వండి
అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం చేపట్టాల్సిన విధివిధానాలపై నివేదిక ఇచ్చేందుకు సమయం కోరిన కమిటీ
న్యాయవాదులు, విశ్రాంత పోలీస్ అధికారులతో చర్చలు పూర్తి
వివరాలు వెల్లడించిన కమిటీ అధ్యక్షుడు నాణయ్య
బెంగళూరు : రాష్ట్రంలో అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం చేపట్టాల్సిన విధివిధానాలపై సూచలు చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదిక ఇవ్వడానికి మరో మూడు నెలల సమయం కోరింది. ఈ మేరకు అత్యాచార నిరోధక కమిటీ అధ్యక్షుడు నాణయ్య తెలిపారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. కమిటీ ఇప్పటి వరకూ న్యాయవాదులు, విశ్రాంత పోలీసు అధికారులతో సహా వివిధ వర్గాలకు చెందిన ఎంతోమంది నిపుణులతో ప్రత్యేకంగా భేటీ అయ్యిందన్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని నివేదిక తయారుచేస్తున్నట్లు చెప్పారు. నిర్భయ ఘటనకు సంబంధించి బీబీసీ చానల్ డాక్యుమెంటరీ తయారు చేసి ప్రసారం చేయడం వెనుక సదుద్దేశ్యం ఏదీ లేదన్నారు.
‘ఇంగ్లాండ్‌లో రోజుకు ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నా బీబీసీ చానల్ అక్కడ డాక్యుమెంటరీను ఎందుకు రూపొందించడం లేదు’ అని ప్రశ్నించారు. దేశంలో మూడు కోట్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా నాణయ్య గుర్తు చేశారు. సాక్ష్యాలు లేకుండా ఈ కేసుల్లో వాదోపవాదాలు జరపడం కాని, తీర్పును ఇవ్వడం కాని ప్రస్తుత భారత దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థను అనుసరించి జరగదన్నారు. అయితే జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఆత్మసాక్షిగా కొన్ని కేసుల్లో తీర్పు చెబుతున్నారని, అలాంటి పరిస్థితి మనదేశంలో రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.