అన్నాడీఎంకేలో ముసలం | internal fight in aiadmk leaders | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేలో ముసలం

Published Tue, Dec 27 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

internal fight in aiadmk leaders

పార్టీలో అంతర్గత కుమ్ములాట
శశికళకు వ్యతిరేకంగా పోరాటానికి
సిద్ధమవుతున్న కార్యకర్తలు
జయ అన్న కుమార్తె దీపకు
మద్దతుగా వెలసిన పోస్టర్లు


తిరువళ్లూరు: అధికార అన్నాడీఎంకే పార్టీలో రాజకీయ ముసలం మొదలైంది. అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీగా శశికళకు మద్దతు తెలుపుతూ జిల్లా నాయకత్వం ఏకీగ్రీవంగా చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కింది స్థాయి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేని శశికళ పేరును జనరల్‌ సెక్రటరీగా ఎలా  సిఫారసు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దీపకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా పోస్టర్లు అంటించడంతో కలకలం మొదలైంది. దీంతో ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు వీధిన పడ్డాయి. ఈ కుమ్ములాటల వల్ల అన్నాడీఎంకే ఓటు చెదిరిపోయే ప్రమాదం ఉందని, తద్వారా కష్టపడి రెండోసారి అధికారంలోకి వచ్చినా వాటి ఫలాలు  పూర్తి కాకముందే అధికారం చేజారిపోయేలా ఉందని అన్నాడీఎంకే నేతలు వాపోతున్నారు.

చెన్నైకు సమీపంలోని జిల్లాగా పేరొందిన తిరువళ్లూరులో మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అన్నాడీఎంకే తమ సత్తాను చాటడంతో పాటు అత్యధిక స్థానాలను గెలుచుకుంటూ వస్తోంది. 2011 ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలు, 2016లో ఏడు స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించి తమ పట్టును నిలుపుకుంది. జిల్లాలో అన్నాడీఎంకేకు బలమైన క్యాడర్, చెక్కు చెదరని ఓటు బ్యాంకు ఉండడంతో అన్నాడీఎంకే గెలుపు నల్లేరుపై నడకలా సాగుతోంది. డీఎంకే హయాంలోనూ జిల్లాలోని అన్నాడీఎంకే  క్యాడర్‌ డీఎంకేకు చుక్కలు చూపించిన సందర్భాలున్నాయి. ఇందుకే తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే కంచుకోటగా మారింది.

జయ మరణంతో మొదలైన ముసలం: జయలలిత ముఖ్యమంత్రిగా పార్టీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఆమె వాక్కు వేదవాక్కు. పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించే వారిపై వేటు పడేది. పార్టీ నిర్ణయాలు ఏకపక్షంగా సాగడంతో పాటు అన్ని కార్యకలాపాలు జయలలిత  కనుసన్నల్లో సాగిపోయేవి. పార్టీలో క్రమశిక్షణతో పాటు అమె నిర్ణయాలకు తిరుగుండదు. అయితే జయలలిత మృతి చెందిన తరువాత అన్నాడీఎంకేలో వేగంగా పరిస్థితులు మారుతున్నాయి. ఎవరికి వారు రాజకీయాలను నడుపుతున్నారు. జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు శశికళకు మద్దతుగా తీర్మానం చేసి ఏకీగ్రీవంగా ఆమోదించారు. అయితే కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు మాత్రం వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని శశికళను పార్టీ కార్యదర్శిగా ఎంపిక చేయడానికి ఎలా  మద్దతు ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్‌సెల్వంను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్న అన్నాడీఎంకే నేతలు శశికళను మాత్రం అంగీకరించేది లేదని తేల్చిచెబుతున్నారు.  

ఇందులో భాగంగానే జయలలిత వారసురాలిగా దీపను నియమించాలని కోరుతూ పోస్టర్లు వెలుస్తున్నాయి. శశికళను పార్టీలోని ఉన్నత పదవికి ఎంపిక చేస్తే తామంతా పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు అంటించారు. మొత్తానికి జయలలిత ఉన్నప్పుడు నోరు మెదపడానికి కూడా ముందుకు రాని నేతలు ప్రస్తుతం పోస్టర్లు, బ్యానర్లతో వీధికెక్కారు. అధికార అన్నాడీఎంకే పార్టీలో మొదలైన ముసలంతో పార్టీ ప్రతిష్ట ఇప్పటికే దెబ్బతిందని, ఇది భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తిరువళ్లూరులోని పలు ప్రాంతాల్లో దీప పేరిట ఏర్పాటు చేసిన బ్యానర్లతో కలకలం మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement