చిన్నమ్మ ఉపదేశం
► ఐక్యత కోసం బంధువులకు లేఖాస్త్రం
► ఒకే వేదికగా దినకరన్, దివాకరన్
► ఆధిపత్యానికి పళని పావులు
► దినకరన్‌కు చెక్ పెట్టే యోచన
సాక్షి, చెన్నై: మనం.. మనం తన్నుకుంటే.. లాభం కమలం పెద్దలకు, సీఎం పళనికి మాత్రమేనన్న విషయాన్ని గ్రహించాలని బంధు జనానికి, కుటుంబీకులకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ లేఖాస్త్రం సంధించి ఉన్నారు. ఐక్యతతో ముందుకు సాగాలన్న శశికళ పిలుపునకు ఆమె సోదరుడు దివాకరన్ స్పందించినట్టున్నారు. దినకరన్‌తో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక.. దినకరన్‌కు చెక్ పెట్టడం లక్ష్యంగా సీఎం పళనిస్వామి పావులు వేగంగానే కదుపుతున్నారు.
అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల ఎపిసోడ్ రాజకీయ ఉత్కంఠను రేపుతోంది. ఓవైపు ఇంటిపోరు, మరోవైపు ముడుపుల వ్యవహారం వెరసి సీఎం పళని స్వామి ఇరకాటంలో పడే పరిస్థితి. అయితే, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి మద్దతిచ్చే యోచనతో పళని దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని తనకు ఆదేశాలు పంపిన ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు చెక్‌పెట్టేందుకు పావులు కదుపుతున్నారు.
ఈనెల 21న పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరగాల్సిన ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మైనారిటీ విభాగం నేత, ఎంపీ అన్వర్ రాజకు పళనిస్వామి అప్పగించడం గమనించాల్సిన విషయం. పార్టీ వ్యవహారాల్లో దినకరన్ తలదూర్చేందుకు వీలు లేని రీతిలో పళని తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే మద్దతు బీజేపీకి అన్న విషయాన్ని స్పష్టంచేస్తూ, పార్టీ తరపున ఒకటి రెండు రోజుల్లో ముందుగానే అధికారిక ప్రకటన చేయించేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ విప్ ముందుగా జారీ అయిన పక్షంలో, తలా ఓ దిక్కుగా ఉన్న ఎమ్మెల్యేలు ధిక్కరించరని పళనిస్వామి ధీమాగా ఉన్నారని చెప్పవచ్చు.
లేఖాస్త్రం
సీఎం పళని స్వామి దూకుడు పెంచడంతో బంధు జనాన్ని ఒకే వేదిక మీదకు తెచ్చే బాధ్యతను పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ తన భుజాన వేసుకున్నట్టున్నారు. అక్కడి నుంచి బంధు జనానికి లేఖాస్త్రం సంధించి ఉన్నారు. ఇందులో మనం.. మనం తన్నుకుంటే, లాభం ఢిల్లీలోని కమలం పెద్దలకు, రాష్ట్రంలోని సీఎం పళని స్వామికి మాత్రమేనన్న విషయాన్ని పరిగణించి ముందుకు సాగాలని హితబోధ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందుకే కాబోలు ఇన్నాళ్లు శశికళ సోదరుడు దివాకరన్ చెప్పినట్టుగా ఆడుతున్న ఎమ్మెల్యేలు పలువురు దినకరన్‌కు మద్దతుగా శనివారం పెదవి విప్పారు.
ఈ ఇద్దరు ఇక ఏమైనట్టేనని, పళనిని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకు సాగడం తథ్యమన్న ధీమాను దివాకరన్, దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇక, దినకరన్‌కు మద్దతుగా మరో ఎమ్మెల్యే కదలడంతో సంఖ్య 35కు చేరింది. మద్దతుదారులతో శనివారం కూడా సుదీర్ఘ చర్చలో దినకరన్ మునిగినా, సాయంత్రం బ్రేక్ ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వాన్ని కూల్చే విధంగా తమ ప్రయత్నాలు ఉండబోదని, దినకరన్‌కు పార్టీ వ్యవహారాల అప్పగింత లక్ష్యంగా ఒత్తిడి పెంచనున్నామని ఆయన మద్దతు ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు.