
మాజీ డీజీపీపై దాడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అతివేగం వద్దన్నందుకు తమిళనాడు మాజీ డీజీపీ రామానుజన్‌పై ఓ లారీ డ్రైవర్ దాడి చేసి గాయపరిచిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. తమిళనాడు జైళ్లశాఖ డీజీపీగా పనిచేసి ఉద్యోగవిరమణ చేసిన రామానుజన్ ప్రస్తుతం తన సొంతూరైన సేలం సూరమంగళంలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు.
తన సొంత పని కోసం సోమవారం సాయంత్రం కారులో సెవ్వాయ్‌పేట సత్రం వంతెనపై వెళుతుండగా ఎదురుగా ఒక లారీ అతివేగంతో అతని కారును ఢీకొనే రీతిలో వచ్చింది. కారు నుంచి కిందకు దిగిన రామానుజన్ ఎందుకు ఇంత వేగంగా లారీ నడుపుతున్నావని మందలించారు. దీంతో లారీడ్రైవర్ సైతం కిందకు మాజీ డీజీపీని దుర్భాషలాడడంతో పాటూ పిడిగుద్దులు కురిపిస్తూ దాడికి పాల్పడ్డాడు. కిందపడిపోయిన రామానుజన్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లారీ డ్రైవర్ పాండియన్ (28)ను అరెస్ట్ చేశారు.