రైతు ప్రాణం పోతున్నా పట్టదా?
► ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ ఇక్కడ సాధ్యం కాదా?
► సీఎం సిద్ధు మేల్కోవాలి
► బీజేపీ పక్ష నేత శెట్టర్
సాక్షి, బెంగళూరు: ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు సాధ్యమవుతున్న రైతుల రుణమాఫీ సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఎందుకు సాధ్యపడట్లేదో అర్థం కావడం లేదని విధానసభలో బీజేపీ పక్ష నేత జగదీశ్ శెట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. కరువు కారణంగా పంటలు ఎండిపోయి అప్పుల బాధతో రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం సిద్ధరామయ్య ఏమాత్రం చలనం లేకుండా కేవలం ఎన్నికలు, పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రైతుల రుణమాఫీపై కుంటిసాకులు చెబుతూ కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ సీఎం సిద్ధరామయ్య రుణమాఫీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా ఆయా ప్రభుత్వాలు రైతుల రుణాలను రద్దు చేశాయని, కానీ ఇక్కడ సిద్ధరామయ్యకు అది ఎందుకు సాధ్యం కావడం లేదని శెట్టర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉపాధి కరువై రైతులు పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారని, పశుగ్రాసం, నీరు లేక పశువులను కబేళాలకు తరలించే దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పారు.
ఆత్మహత్యలు ఇక్కడే ఎక్కువ
దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ చేయని సిద్ధరామయ్య ఎన్నికల్లో విజయమే పరమావధిగా ఇష్టారీతిలో భాగ్యలను ప్రవేశపెడుతూ రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని శెట్టర్ విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలోనే రైతుల ఆత్మహత్య కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో రైతు ప్రాణాలు తీసుకుంటున్నాడని తెలిపారు. దీంతో రైతుల కుటుంబాలు వీధిన పడుతున్నారని రైతుల పిల్లలు అనాథలవుతున్నారని, ఇప్పటికైనా సీఎం సిద్ధరామయ్య నిద్రలోంచి బయటకు వచ్చి రుణమాఫీ చేయడంతో పాటు ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలను ఆదుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని శెట్టర్ హెచ్చరించారు.