
అమ్మకు ఏమైంది?
జయ ఆర్యోగ పరిస్థితి తెలపాలని
ఈవీకేఎస్, తిరుమా వ్యాఖ్యలు
తమిళి సై ఆగ్రహం
అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు ఏమైందన్న..? చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, వీసీకే నేత తిరుమావళవన్ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై బహిర్గతం చేయాలన్న డిమాండ్‌ను తెర మీదకు తీసుకురావడం ఉత్కంఠకు దారి తీస్తున్నది. ఒకరి ఆరోగ్య పరిస్థితిపై మరొకరు వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత అవిశ్రాంతంగా రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విముక్తి లభించాక, మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అవిశ్రాంతంగా ప్రభుత్వ వ్యవహారాల మీద ఆమె దృష్టి పెట్టారు. ప్రారంభోత్సవాలతో బిజీబిజీ అయ్యారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ వేడుకను సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించారు. మెట్రో ప్రారంభోత్సవం అనంతరం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాలు లేవు. ఇక ప్రతిరోజూ ఏదో ఒక ప్రకటన ద్వారా పార్టీ వర్గాలకు సందేశాలు ఇవ్వడం, ఆర్థిక సాయం ప్రకటించడం, ఎవరైనా మరణిస్తే సంతాపాలు తెలియజేస్తూ వస్తున్న జయలలిత ఆరోగ్య పరిస్థితిపై తాజాగా చర్చ బయలు దేరింది. ఆమె ఆరోగ్యంపై కొన్ని ప్రతి పక్ష పార్టీల నాయకులు పెదవి విప్పుతోండడం అన్నాడీఎంకే వర్గాల్లోనే కాదు, రాష్ట్ర ప్రజల్లోనూ ఉత్కంఠ బయలు దేరింది.
ఇంతకీ సీఎం జయలితకు ఏమయ్యిందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక, ఆమె ఆరోగ్య పరిస్థితులపై కొన్ని ప్రతి పక్షాలు గళం విప్పడం వదంతుల్లో భాగమేనా అన్న ప్రశ్న సందిగ్ధత నెలకొంది. అమ్మకు ఏమైంది...?: అసెంబ్లీ ఎన్నికల ద్వారా మళ్లీ సీఎం పగ్గాలు లక్ష్యంగా పావులు కదుపుతూ, పార్టీలో మార్పులు చేర్పుల కసరత్తుల దిశగా ముందుకు సాగుతున్న సీఎం , అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలిత ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీకేఎస్ ఇళంగోవన్, తిరుమా వళవన్ వ్యాఖ్యలు చేయడం, దానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ మండి పడడంతో ఆరోగ్య చర్చ తెర మీదకు వచ్చింది. సత్యమూర్తి భవన్‌లో జరిగిన కార్యక్రమానంతరం ఈవీకేఎస్ ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆరోగ్యంపై అనుమానాలు బయలుదేరి ఉన్న నేపథ్యంలో దానిని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
ఆమె సాధారణ వ్యక్తి కాదు అని, తమిళ ప్రజలందరికి నేతృత్వం వహిస్తున్న సీఎం అన్న విషయాన్ని గుర్తెరిగి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక, శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన వీసీకే నేత తిరుమావళవన్ సైతం సీఎం ఆరోగ్య పరిస్థితిపై స్పందించడం గమనార్హం. సీఎంకు ఏమయ్యిందోనన్న వివరాలను అన్నాడీఎంకే అధిష్టానం , రాష్ర్ట ప్రభుత్వా వర్గాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వ్యక్తిగతం కాదు అని, ఆమె ఆరోగ్య వివరాలను గోప్యంగా ఉంచడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇక, ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి ఆరోగ్య పరిస్థితి అన్నది వారి వ్యక్తిగతం అని, దీనిని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని కూడా రాజకీయం చేయాలని చూడడం శోచనీయమని విమర్శించారు.
రాజకీయ, అధికార వ్యవహారాలపై విమర్శలు చేసే అధికారి ప్రతి పక్షాలకు ఉన్నాయని, అయితే, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుల గురించి వ్యాఖ్యానించే అర్హత లేదని మండి పడ్డారు. ఇక, రాష్ర్టంలో సీఎం ఉన్నారా, ప్రభుత్వం ఉందా.. అన్న అనుమానం కల్గుతోందని తంజావూరు పర్యటనలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పేర్కొనడం గమనించాల్సి విషయం. కాగా, ఓ వైపు సీఎం ఆరోగ్యంపై ప్రతి పక్ష పార్టీనాయకులు విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే, మరో వైపు పలు ప్రమాదాల్లో మరణించిన ఐదుగురు కుటుంబాలకు తలా *మూడు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ సీఎం జయలలిత ఆదేశాలు ఇవ్వడం విశేషం.