
తీర్పుకు కట్టుబడాల్సిందే!
సాక్షి, చెన్నై : న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడాల్సిందేనని డీఎండీకే అధినేత విజయకాంత్ అన్నారు. అనుకూలంగా తీర్పు వస్తే సంబరాలు చేసుకోవడం లేదంటే దాడులకు దిగడం హేయమైన చర్యగా ఖండించారు. ఇకనైనా ‘తలైవి’జపం వీడి ప్రజా హితాన్ని కాంక్షించాలని అన్నాడీఎంకే శ్రేణులకు హితవు పలికారు. కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా ఆ పార్టీ వర్గాలు రాష్ట్రంలో సాగిస్తున్న నిరసనల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ పదే పదే ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ గగ్గోలు పెడుతున్నారు. తమకు భద్రత కల్పించాలని ఏకంగా గవర్నర్ రోశయ్యకు సైతం విజ ్ఞప్తి చేసిన విజయకాంత్ తాజాగా తన స్వరాన్ని మరిం తగా పెంచారు. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాడీఎంకే వర్గాలపై విరుచుకు పడ్డారు. హిత బోధ చేస్తూనే, తలైవి జపం వీడండని సూచించారు.
అంగీకరించాల్సిందే: సీఎంగా జయలలిత ఉన్న సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పులన్నింటిని అన్నాడీఎంకే వర్గాలు ఆహ్వానించాయని, అంగీకరించాయని, సంబరాలు చేసుకున్నాయని వివరించారు. అయితే, అదే కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును మాత్రం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. తమ తలైవి నిరపరాధి అని కన్నీళ్లు పెడుతున్నారని, ఆమె నిరపరాధిగా ఉండి ఉంటే, 18 ఏళ్లు వాయిదాల మీద వాయిదాలతో విచారణను ఎందుకు కాలయాపన చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఓ విధంగా, వ్యతిరేకంగా వస్తే మరో విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అధికార పక్షంలో ఉంటూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ప్రజా సంఘాలు, ప్రైవేటు సంస్థల్ని బెదిరించి మరీ నిరసనల బాట పట్టించడం ఎంత వరకు సమంజసమని మండి పడ్డారు.
144 సెక్షన్: కావేరి, ముల్లైపెరియార్ డ్యాం హక్కులపై తమిళనాడుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే సంబరాలు చేసుకున్నారని, ఆ గెలుపు ఏదో జయలలిత వ్యక్తిగతంగా సాధించినట్టు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఏదేని నిరసన బయలు దేరుతోందంటే చాలు జిల్లా...జిల్లాకు 144 సెక్షన్ అమలయ్యేదని గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాల రగులుతుంటే ఎందుకు ఆ సెక్షన్ ప్రయోగించడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక , తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా పోస్టర్లు వెలుస్తుంటే, పోలీసులు చోద్యం చూడడం శోచనీయమని మండి పడ్డారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి వ్యతిరేకంగా, ఆ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తున్న అన్నాడీఎంకే వర్గాలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు తలైవి జపం చేసింది చాలు అని, ఇకనైనా ఁతలైవిరూ. నినాదాన్ని పక్కన పెట్టి ప్రజా హితాన్ని కాంక్షించే విధంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు విజయకాంత్ సూచించడం గమనార్హం. తనకు ఎలాంటి భయం లేదని, నా మీద నాకు నమ్మకం ఉందని, ప్రభుత్వంతో ప్రజల కోసం ఢీకొట్టేందుకు ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించడం విశేషం.