‘అన్నా’కు ఘన నివాళి
సాక్షి, చెన్నై:ప్రతి ఏటా అన్నాదురై జయంతిని రాష్ర్టంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే తదితర పార్టీల నేతృత్వంలో సేవా, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పోటీలకు వేదికగా అన్నా జయంతిని ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. సోమవారం అన్నాదురై 106వ జయంతి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల్లో వేడుకలు జరిగాయి. ఆయా పార్టీల నేతృత్వంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అన్నా చిత్ర పటాల్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ అన్నా పాటల్ని, ప్రసంగాల్ని హోరెత్తించారు.
నేతల నివాళి: అన్నా జయంతిని పురస్కరించుకుని కోయంబత్తూరులోని ఆయన విగ్రహానికి సీఎం జయలలిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు ఓ పన్నీర్ సెల్వం, పళనియప్పన్, వైద్యలింగం, మోహన్, మునుస్వామి తదితరులు నివాళులర్పించారు. చెన్నై అన్నా సాలైలోని అన్నా విగ్రహం వద్ద అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, నాయకులు బన్రూటి రామచంద్రన్, సులోచనా సంపత్, విశాలాక్షి నెడుంజెలియన్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. వళ్లువర్‌కోట్టంలోని అన్నా విగ్రహం వద్ద డీఎంకే నేతృత్వంలో వేడుకలు జరిగాయి. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, నాయకులు ఆర్కాట్ వీరా స్వామి, దురై మురుగన్, సద్గుణ పాండియన్, టీ ఆర్ బాలు తదితరులు పాల్గొని అన్నా విగ్రహానికి పూలమాలలు వేశారు.
సాయంత్రం అన్నా అరివాళయంలో అన్నా జయంతి, పెరియార్ జయంతి, డీఎంకే ఆవిర్భావ వేడుక మూడింటిని కలుపుతూ ముప్పెరుం విళా ఘనంగా జరిగింది. ఇందులో డీఎంకే నేతృత్వంలో జరిగిన పోటీల్లో విజేతలకు, పదో తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులను కరుణానిధి ప్రదానం చేశారు. ఎంజియార్ మండ్రం అధ్యక్షుడు ఆర్‌ఎం వీరప్పన్, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం అన్నాకు నివాళులర్పించారు. ఎండీఎంకే నేతృత్వంలో ఆ పార్టీ కార్యాలయం తాయగంలో అన్నా జయంతిని నిర్వహించారు. ఆ పార్టీ అధినేత వైగో అన్నా విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం పూందమల్లిలో జరిగే మహానాడుకు వెళ్లారు. అక్కడ వేదిక వద్ద అన్నా విగ్రహం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అన్నా జయంతిని పురస్కరించుకుని జరిగిన మహానాడులో బల నిరూపణకు వైగో యత్నించడం గమనార్హం. డీఎండీకే కార్యాలయంలో జరిగిన వేడుకలో అన్నా చిత్ర పటానికి విజయకాంత్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పుష్పాంజలి ఘటించారు.