కోలుకుంటున్న అమ్మ!
► స్వదేశానికి తిరిగివెళ్లిన లండన్ వైద్యుడు రిచర్డ్
► ఇక సింగపూర్ నిపుణుల ఆధ్వర్యంలో జయకు కొనసాగనున్న చికిత్స
► పన్నీరు నేతృత్వంలో తొలిసారి కేబినెట్ భేటీ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే
సాక్షి, చెన్నై: లండన్ నుంచి వచ్చిన ప్రముఖ వైద్య నిపు ణుడు డాక్టర్ రిచర్డ్, అపోలో, ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో వారానికి పైగా జరిగిన చికిత్సకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కొంత మేర మెరుగుపడినట్లు సమాచారం. వీరికితోడు సింగపూర్ నుంచి వచ్చిన ఫిజియోథెరపీ నిపుణులు అందిస్తున్న చికిత్సకు జయలలిత స్పందిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి. రోజురోజుకు అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతుండడంతో ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీకి తిరిగివెళ్లారు. అలాగే లండన్ వైద్యుడు రిచర్డ్ కూడా బుధవారం ఇక్కడి నుంచి స్వదేశానికి బయల్దేరారు.
ఈ నేపథ్యంలో రిచర్డ్ సూచనల మేరకు సింగపూర్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం అపోలోకు వచ్చినా, ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చినట్టు సమాచారం. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నాడనే ఆరోపణపై తమిళనాడు పోలీసులు బుధవారం సహాయం(తంజావూరు) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
పన్నీర్‌సెల్వం అధ్యక్షతన కేబినెట్ భేటీ
రాష్ట్రంలో ఒకవైపు స్థానిక ఎన్నికల రద్దు, మరోవైపు కావేరి బోర్డు కోసం పట్టుబడుతూ తమిళనాడులో నిరసనలు హోరెత్తుతుండడంతో బుధవారం మంత్రి పన్నీర్‌సెల్వం అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. కావేరి బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల రద్దు కారణంగా ఆయా సంస్థల్లో ప్రత్యేక అధికారులకు విధుల్ని అప్పగించాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా స్థానాలకు అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాలకు సెంథిల్ బాలాజీ, రంగస్వామికి మళ్లీ అవకాశం కల్పించారు. తిరుప్పర గుండ్రం సీటును మాజీ ఎమ్మెల్యే ఏకే బోసుకు, పుదుచ్చేరి నెల్లితోప్పు స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే ఓం శక్తి శేఖర్‌కు అప్పగించారు.