ఓ టెకీనే అమ్మపై దుష్ప్రచారం చేశాడు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై దుష్ప్రచారం చేసిన వ్యక్తుల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జయ ఆరోగ్యం సరిగా లేదంటూ ఓ వెబ్ సైట్ ద్వారా ఆపోలో ఆస్పత్రిలో ఉద్యోగి చెప్పినట్లుగా ఓ వెబ్ సైట్ ద్వారా ప్రచారం చేశారు. దీనికి సంబంధించి సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించి సతీశ్ కుమార్ (26), మదాసమి(25) అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వీరిలో సతీశ్ కుమార్ ఎంసీఏ చదివాడు.
ప్రస్తుతం ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుండగా మదాసమి కూడా వాలచెరీలోని ఓ ప్రైవేట్ సంస్థలో టెక్నీషియన్ పని చేస్తున్నాడు. 'టెక్నీషియన్ వెబ్ సైట్లో అపోలో ఆస్పత్రి ఉద్యోగి చెప్పినట్లుగా ఉన్న ఆడియోను వెబ్ సైట్ లో నమోదు చేయగా.. ఐటీ ఇంజినీర్ ఫేస్బుక్ లో జయ ఆరోగ్యంపై దుష్ప్రచారం చేశాడు. వీరిద్దరు కూడా ప్రజలు భయపడేంత స్థాయిలో ఆడియో క్లిప్పింగులు, సందేశాలు పెట్టారు' అని పోలీసులు వివరించారు. ఏఐఏడీఎంకే ఐటీ విభాగం సెక్రటరీ కేఆర్ రామచంద్రన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విచారణ చేసి అరెస్టులు చేశారు.