
జేడీఎస్ కార్యాలయం ఖాళీ
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జేడీఎస్ పార్టీ కార్యాలయాన్ని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర్‌కు
నేడు కేపీసీసీకి అప్పగింత : దేవెగౌడ
బెంగళూరు : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జేడీఎస్ పార్టీ కార్యాలయాన్ని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ. పరమేశ్వర్‌కు నేడు (ఆదివారం) అప్పగించబోతున్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ తెలిపారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌ను శనివారం ఆయన దగ్గరుండీ మరీ మరో ప్రాంతానికి మార్పించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... చివరి వరకూ కార్యాలయాన్ని దక్కించుకోవడానికి చాలా పోరాడమన్నారు. అయితే న్యాయస్థానంలో కాంగ్రెస్ పార్టీకే విజయం దక్కిందని వాపోయారు.
న్యాయస్థానం ఆదేశాలను ఎవరైనా పాటించక తప్పదన్నారు. ఇందుకు తాను అతీతుడేమి కాదని తెలిపారు. సరైన భవనం దొరికినప్పుడు తమ కార్యాలయాన్ని అందులో కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఆనందరావ్ సర్కిల్‌లో ఉన్న జేడీఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి చెందినదని అందువల్ల ఆ కార్యాలయాన్ని కర్ణాటక కాంగ్రెస్ పార్టీకు అప్పగించాలని ఆ పార్టీ నాయకులు న్యాయస్థానంలో కేసు వేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.