ముంబై: తన కుమార్తె మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ నటి జియాఖాన్ తల్లి రబియా అమిన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలుచేశారు. జియా ఆత్మహత్య చేసుకోలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రబియా తరఫు న్యాయవాది దినేశ్ తివారి శుక్రవారం వెల్లడించారు.తన వాదనకు బలం చేకూరేవిధంగా రబియా ... ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇచ్చిన నివేదికను పిటిషన్‌కు జత చేశారు. పోలీసులు సరైనరీతిలో దర్యాప్తు జరపలేదని, అంతేకాకుండా తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పంచోలీకి పరోక్షంగా సహకరించారని రబియా ఆరోపించారు.
ఆదిత్య పంచోలి కుమారుడైన సూరజ్ పంచోలి పోలీసులను తనవైపునకు తిప్పుకున్నాడన్నారు. ఇది హత్యే అయినప్పటికీ ఆత్మహత్యను తలపించేలా చేశారనేందుకు తనవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని తన పిటిషన్‌లో రబియా పేర్కొన్నారు. హత్య చేసిన అనంతరం జియాను వేలాడదీసి ఉండొచ్చన్నారు. ఇటువంటి కేసుల్లో మెదడులో రక్తం గడ్డ కడుతుందని, అయితే ఈ కేసు విషయంలో అటువంటిదేమీ లేదన్నారు. జియా ముఖంతోపాటు ఆమె శరీర భాగాలపై గాయాలుండడాన్ని గమనించొచ్చన్నారు.
పెదానికి కుడివైపు, ఎడమచేయిపైనా గాయాలు ఉన్నాయని, దీనినిబట్టి ఆమెను ఎవరో కదలకుండా కట్టివేసి ఉండొచ్చన్నారు. అయితే జియా దుపట్టాతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారని, ఉరి తీయడం వల్లనే జియా శరీరంపై లోతైన గుర్తులు ఏర్పడ్డాయని, మెత్తటి వస్తువులతో బిగిస్తే అటువంటి గుర్తులు రావని ఫోరెన్సిక్ నిపుణుడు రంగరాజన్ తన నివేదికలో పేర్కొన్నారని జియా తన పిటిషన్‌లో కోర్టుకు తెలియజేశారు. జియా గొంతు పిసికి ఉండొచ్చంటూ పేర్కొన్నారన్నారు. ఆత్మహత్యకు కొద్దిక్షణాల ముందే జియా తన గదిలోకి వచ్చిందని, ఆ సమయంలో ట్రాక్ సూట్‌లో ఉన్నట్టు సీసీటీవీ కెమెరాల్లో నమోదైందని, అయితే మృతదేహంపై నైట్ గౌన్ ఉందని, ఆత్మహత్య చేసుకునేందుకు ఎవరైనా దుస్తులు మార్చుకుంటారా అంటూ ప్రశ్నించారు. రెండు సింగిల్ బెడ్‌ల మధ్య సీలింగ్ ఫ్యాన్ ఉందని, ఏదో వస్తువు లేకుండా ఆత్మహత్య ఎలా సాధ్యమని పిటిషనర్ ప్రశ్నించారు.