సాక్షి, న్యూఢిల్లీ: న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్‌ను మంత్రిమండలి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఢిల్లీ సచివాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ కార్యక ర్తలు.. తోమర్‌ను వెంటనే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నకిలీ డిగ్రీ ఉపయోగిస్తున్న తోమర్‌ను సీఎం కేజ్రీవాల్ తనమంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. అలాగే తోమర్‌కు, ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ధరించి నినాదాలు చేశారు. తర్వాత బారికేడ్లను దాటి సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
దీంతో నిరసనకారులను అదుపుచేయడం కోసం పోలీసులు వాటర్‌కేనన్లను ఉపయోగించారు. అనంతరం నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ మాట్లాడారు. తోమర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించేంతవరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వచ్ఛమైన పాలన అందిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన ఆప్ ఇప్పుడు అవినీతిపరులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు.
ఆప్‌కు ‘తోమర్’ తలనొప్పి
తోమర్ నకిలీ డిగ్రీ వివాదం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కారుకు తలనొప్పిగా మారింది. తోమర్‌ను మంత్రిమండలినుంచి తొలగించాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే తోమర్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం వద్ద బుధవారం బీజేపీ ధర్నా చేసింది. తోమర్ ‘లా’ డిగ్రీ నకిలీదని బీహార్‌లోని తిల్క్ మాంఝీ భాగల్‌పుర్ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఆయన డిగ్రీ తమ రికార్డుల్లో లేదని వెల్లడించింది. ఇది తెలిపినప్పటి నుంచి ప్రతిపక్షాలు ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న డిమాండ్‌ను నెత్తికెత్తుకున్నాయి.
కేజ్రీవాల్‌కు తోమర్ లేఖ
గత మూడు రోజులుగా ప్రతిపక్షాలు తనపై చేస్తున్న దాడిని తోమర్ ఖండించారు. వారి ఆరోపణలను అర్థంలేని, నిరాధారమైనవిగా అభివర్ణించారు. తోమర్ ఈమేరకు సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ఈ ఆరోపణల వెనుక తన పరువును, పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసే కుట్ర దాగుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత నంద్ కిశోర్ గర్గ్‌పై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్ మంగళవారం తోమర్‌ను సంజాయిషీ కోరిన సంగతి తెలిసిందే.
తోమర్‌ను వెంటనే తొలగించాలి
Published Thu, Apr 30 2015 10:16 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement