నాపై ఫిర్యాదు తగదు
నాపై ఆ చిత్రాల నిర్మాతలు ఫిర్యాదు చేయడం సమంజసం కాదని యువ నటి శ్రీ దివ్య అంటున్నారు. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంతో విజయబాట పట్టిన ఈ ఆరణాల తెలుగమ్మాయి కోలీవుడ్‌లో ఇప్పుడు బిజీ హీరోయిన్. ఇటీవల విడుదలైన జీవా చిత్రం కూడా ఈ బ్యూటీ హిట్ ఖాతాలో చేరింది. ప్రస్తుతం కాక్కిసట్టై, పెన్సిల్, వెళ్లక్కార దురై మొదలగు చిత్రాల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాలకు ముందు కాట్టుమల్లి, నగర పురం చిత్రాలను అంగీకరించారు. ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మ పారితోషికం వేల సంఖ్యలోనే ఉండేది. ప్రస్తుత అరకోటి వరకు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. చిత్ర నిర్మాణం పూర్తి కాని కాట్టుమల్లి, నగరపురం చిత్రాలను పూర్తి చేయడానికి ఈ అమ్మడు ప్రస్తుత పారితోషికం చెల్లిస్తేనే కాల్‌షీట్స్ కేటాయిస్తానని శ్రీదివ్య అంటున్నట్లు ఆ చిత్రాల నిర్మాతలు, తమిళ నిర్మాతలు మండలిలో ఫిర్యాదు చేశారు.
దీనికి స్పందించిన శ్రీ దివ్య అన్ని చిత్రాలకు సహకరిస్తున్నానన్నారు. అలాంటిది తనపై ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు. ఇక కాట్టుమల్లి చిత్రం విషయానికొస్తే అది రెండేళ్ల క్రితం ఒప్పుకున్న చిత్రం అని వెల్లడించారు. అప్పుడు ప్రారంభమైన ఆ చిత్ర షూటింగ్ అనూహ్యంగా ఆగిపోయిందని తెలిపారు. అందుకు చిత్ర యూనిట్‌లో నెలకొన్న అయోమయ పరిస్థితినే కారణమన్నారు. తనకు నిర్మాతల తరపు నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అందువల్లనే ఆ చిత్ర కాల్‌షీట్స్‌ను ఆ చిత్ర దర్శక, నిర్మాతలు ఫిర్యాదు చేశారని శ్రీ దివ్య అంటున్నారు.