‘నిర్బంధ కన్నడ’ రద్దు | Kannada can't be compulsory medium of instruction in schools: SC to Karnataka | Sakshi
Sakshi News home page

‘నిర్బంధ కన్నడ’ రద్దు

Published Wed, May 7 2014 2:35 AM | Last Updated on Sat, Sep 1 2018 5:05 PM

‘నిర్బంధ కన్నడ’ రద్దు - Sakshi

‘నిర్బంధ కన్నడ’ రద్దు

సుప్రీం తీర్పు..  సర్కారుకు ఎదురు దెబ్బ
 - 20 ఏళ్ల వ్యాజ్యానికి తెర  
- హైకోర్టు తీర్పు సరైందే
- నాలుగో తరగతి వరకు ఇక ‘నిర్బంధం’ వద్దు
- బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్దరాదు
- తల్లిదండ్రుల నిర్ణయం మేరకే మాధ్యమం ఎంపిక
- తీర్పు పట్ల విచారం వ్యక్తం చేసిన సాహితీవేత్తలు
- అమలైతే భాషల మనుగడకు ప్రమాదమని ఆందోళన
- అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలన్న  సీఎం
- ఇది భాషా మాధ్యమ ఉద్యమానికి
- విఘాతం కాబోదన్న మంత్రి కిమ్మనె రత్నాకర్

 
 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు విధిగా కన్నడ మాధ్యమంలోనే అభ్యసించాలన్న ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కొట్టి వేసింది. ప్రాథమిక విద్యను అభ్యసించాలనుకునే భాషా అల్ప సంఖ్యాకులపై బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్ద కూడదని అభిప్రాయపడింది.

ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం. లోధా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఉత్తర్వులను వెలువరించడం ద్వారా సుమారు 20 ఏళ్ల వ్యాజ్యానికి తెర దించింది. నాలుగో తరగతి వరకు నిర్బంధ కన్నడ మాధ్యమాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. రాష్ర్ట ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల మధ్య 1994 నుంచి ఈ న్యాయ పోరాటం సాగుతోంది.

తల్లిదండ్రుల ఇష్టం
తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుకోవాలనే విషయమై తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటారని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రాథమిక విద్యను విధిగా కన్నడ మాధ్యమంలోనే అభ్యసించాలన్న రాష్ట్ర ప్రభుత్వ భాషా మాధ్యమ విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు 2008 జులై 2న వెలువరించిన తీర్పును సమర్థించింది. ప్రాథమిక విద్యలో కన్నడ మాధ్యమాన్ని నిర్బంధం చేయడం సరికాదని, సమంజసమూ కాదని పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల సమాఖ్య కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

భిన్నాభిప్రాయాలు
 సుప్రీం కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జాగ్రత్తగా స్పందించారు. సాహితీవేత్తలు ఈ తీర్పు పట్ల విచారం వ్యక్తం చేశారు. తీర్పు ప్రతి చేతికందాక, పూర్తిగా అధ్యయనం చేసి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా సుప్రీం తీర్పు భాషా మాధ్యమ ఉద్యమానికి విఘాతం కాాబోదని పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి, సాహితీవేత్తలతో చర్చించి తదుపరి న్యాయ పోరాటంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భాషా పరంగా చూస్తే ఈ తీర్పు దురదృష్టకరమని పేర్కొన్నారు.

తీర్పు అమలైతే భాషల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు ద్వారా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు గెలిచినట్లు భావించరాదని అన్నారు.  ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లు కూడా కాదని తెలిపారు. సీనియర్ పరిశోధకుడు చిదానంద మూర్తి ఈ తీర్పు హాస్యాస్పదమని అన్నారు. మన సంస్కృతి బతికి బట్ట కట్టాలంటే మాతృ  భాషలోనే ప్రాథమిక విద్యను బోధించాలని తెలిపారు.

వేరే భాషల్లో బోధన వల్ల కన్నడం నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పారు. ‘ఒక వేళ నాకు అధికారం లభిస్తే దేశంలో ఆంగ్ల మాధ్యమాన్ని పెకిలించి వేస్తాను. మాతృ  భాషలోనే విద్యా బోధన సాగాలని ఉత్తర్వులు జారీ చేస్తాను’ అని జాతి పిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. కాగా ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం, కోర్టుల్లో రివ్యూ పిటిషన్లను దాఖలు చేస్తామని కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు పుండలీక హాలంబి తెలిపారు. ఈ తీర్పును ఒప్పుకోవడం సాధ్యం కాదని కన్నడ చళువలి నాయకుడు వాటాళ్ నాగరాజ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement