మంగుళూరులో వలస కార్మికుల ఆందోళన
సాక్షి, బెంగళూరు : ‘పని వద్దు.. అన్నం వద్దు.. మేము ఊరికి వెళ్లాలి..దయచేసి మమ్మల్ని పంపించండి’ కర్ణాటకలోని వలస కార్మికుల ఘోష ఇది. రాష్ట్రంలో చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్దకు గుమిగూడుతున్నారు. అలాగే పలువురు కార్మికులు ఆయా రవాణా మార్గాలు లేకపోవడంతో కాలినడకన తమ సొంత రాష్ట్రాలకు బయలుదేరారు. ఉపాధి లేక, చేతుల్లో డబ్బులు లేక, సొంతూళ్లకు వెళ్లలేక వలస కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. మరోవైపు శ్రామిక్ రైళ్ల రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర సర్కార్ ఉపసంహరించుకోవడంతో కార్మికులకు కొంత ఊరట లభించింది. (కరోనా: అధిక మరణాలకు ఆ రెండే కారణాలు)
ఆయా రాష్ట్రాలు అంగీకరించాలి..
కార్మికులను వారి రాష్ట్రాలకు పంపాలంటే తొలుత వారి రాష్ట్రాల నుంచి అనుమతులు రావాలని అందుకే వారిని తరలింపులో ఆలస్యం అయిందని కర్ణాటక సర్కార్ స్పష్టం చేసింది. మే 8 నుంచి 15 వరకు రాష్ట్రాలకు ప్రతి రోజూ శ్రామిక్ రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. శుక్రవారం నుంచి పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు ప్రతిరోజూ రెండు రైళ్లు, బిహార్, త్రిపుర, మణిపుర్‌కు చెరొక రైలు బయలుదేరుతున్నట్లు వెల్లడించింది. భౌతిక దూరం పాటించేందుకు ప్రతి రైలులో 1200 కార్మికులకు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు వలస కార్మికులను తరలించేందుకు మే 3న రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. దీనికి సమాధానం రానందున గురువారం మళ్లీ లేఖలు రాశారు. బిహార్, ఉత్తర ప్రదేశ్‌నుంచి మాత్రమే అనుమతి వచ్చింది. దీతో శుక్రవారం ఆ రాష్ట్రాలకు నాలుగు రైళ్లలో కూలీలను తరలించారు. మిగతా రాష్ట్రాలు అంగీకరిస్తే మిగిలిన కార్మికులను కూడా తరలించేందుకు సిద్ధమైంది.
కార్మికుల కాలిబాట..
శ్రామిక్ రైళ్ల రద్దు విషయాన్ని తెలుసుకున్న వలస కార్మికులు కాలిబాట పట్టారు. ఏ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడకుండా తమ సొంత కాళ్లను నమ్ముకోవడం ఉత్తమమని వారి రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారు. తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు నడుచుకుంటూ వెళుదామని ప్రయత్నించారు. గురువారం కొందరు హెబ్బాల వద్ద ఉత్తరప్రదేశ్‌కు వెళ్లేందుకు కాలినడకన వెళ్లేందుకు చేరుకున్నారు. తొలుత హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి ఏదేని వాహనం ద్వారా వెళ్లవచ్చని నడుచుకుంటూ వెళ్లారు. ఈ నేపథ్యంలో కర్ణాటకను దాటి వెళ్లేందుకు బయలుదేరిన కార్మికులు సరిహద్దుల్లో చిక్కుకుంటున్నారు. అక్కడ అనుమతి లేకుండా సరిహద్దు దాటించి పంపడం సాధ్యం కాదని అధికారులు అడ్డుకుంటున్నారు.
మంగళూరు, హాసన్‌లో ఆందోళన
యశవంతపుర: తమను స్వంతూళ్లకు పంపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలు ఆందోళనకు దిగారు. కార్మికులను స్వస్థలాలకు చేర్చుతారని వార్తలు రావడంతో మంగళూరు రైల్వే స్టేషన్ వద్దకు శుక్రవారం వేలాదిగా కార్మికులు తరలి వచ్చారు. అయితే తమకు అలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్పడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ఎస్పీ మదన్‌మోహన్ అక్కడకు చేరుకొని ప్రభుత్వంతో చర్చించి రైలు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని నచ్చచెప్పటంతో అందోళనను విరమించారు. హాసన్‌లోని హిమత్ సింగ్‌కా పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్, అసోంకు చెందిన కార్మికులు హాసన్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment