కెలమంగలం వారసంతలో విక్రయానికొచ్చిన పశువులు, లేగదూడలు
కర్ణాటక ,కెలమంగలం: క్రిష్ణగిరి జిల్లాలోనే కాక కర్ణాటకలోని కోలారు జిల్లాలో కూడా ఈ ఏడాది కరువు పీడించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరువుతో పశువులకు మేత, తాగునీరు అందక పోవడంతో రైతులు పశువులను కెలమంగలం సంతలో విక్రయాలకు తరలించారు. కెలమంగలంలో ప్రతి ఆదివారం వారసంత జరుగుతుంది. ఈ సంతలో పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు పశువులను కొనుగోళ్లకు వస్తుంటారు. కోలారు, క్రిష్ణగిరి, బెంగళూరు గ్రామీణ జిల్లాల నుండి రైతులు పశువులను విక్రయించేందుకు తీసుకొస్తారు. ఆదివారం సంతలో 800కు పైగా పశువులు విక్రయాలకు వచ్చాయి. రూ. లక్ష విలువ చేసే జత ఎద్దులు రూ. 50 వేలుకు అమ్మేందుకు రైతులు సిద్ధమైనా కొనుగోలుదారులు లేకపోయారు.
పశుగ్రాసం కొరత
వర్షాలు లేక , పొలం పనులు లేక, ఇంట్లో గ్రాసం కరువై భారంగా భావించి తక్కువ ధరలకే పశువులను రైతులు తెగనమ్ముతున్నారు. గత ఏడాది జిల్లా మంత్రి బాలక్రిష్ణారెండ్డి కరువు వల్ల పశుగ్రాసం కొరతతో ప్రభుత్వం ద్వారా ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేశారని, ఈసారి పట్టించుకొనే నాథుడే లేదని సంతలో రైతులు వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా వర్షాలు అంతంత మాత్రమేనని, ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణమని తెలిపారు. అధికారులు ఉచితంగానో, డబ్బుకో పశుగ్రాసం సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment