గూడు దక్కేనా ? | Kathputli Colony residents Andhra Pradesh public | Sakshi
Sakshi News home page

గూడు దక్కేనా ?

Published Sat, Mar 8 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

Kathputli Colony residents Andhra Pradesh public

సాక్షి, న్యూఢిల్లీ: ఏళ్లుగా తలదాచుకుంటున్న గూడు చెదుతుందోమోనన్న ఆవేదన తో సతమతమవుతున్నారు రాజధానిలోని నిరుపేద తెలుగువారు. పశ్చిమఢిల్లీలోని షాద్‌పూర్ డిపో సమీపంలోని కట్‌పుత్లీ కాలనీలో దాదాపు 50 తెలుగు కుటుంబాలు 40 ఏళ్లుగా నివాసముంటున్నాయి. ఎన్నోఏళ్లుగా ఉంటున్న స్థలాన్ని డీడీఏ రహేజా డెవలపర్స్ కంపెనీకి విక్రయించడంతో వీరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పునరావాసంలో భాగంగా తాత్కాలిక గృహాలతోపాటు శాశ్వత ప్రాతిపదికన బహుళ అంతస్తుల భవనం నిర్మించి ఇస్తామని సదరు కంపెనీ హామీ ఇస్తోంది. ఇప్పటికే ఆనందర్‌పర్బత్ ప్రాంతంలో తాత్కాలిక గృహాలను ఏర్పాటు చేశారు. అయితే తమకు  లిఖిత పూర్వక హామీ ఇవ్వకుండానే ఇళ్లు ఖాళీ చేయమంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 
 పస్తుతం ఉంటున్నవారికి సరిపడా ఇల్లు ఇవ్వడం లేదని, కొందరు ఫుట్‌పాత్‌ల పాలు కావాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు.దీనిపై స్థానిక తెలుగువారికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని కె.బాబురావు మాట్లాడుతూ..‘మేం అందరం 40 ఏండ్ల కింద ఈడికి వచ్చినం. ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన బుడగజంగాల వాళ్లే! మేం మూలికల వైద్యం, కూలీ పనులతో పొట్టపోసుకుంటున్నం. నాయకులు కూడా మాకు ఈ స్థలంలనే ఇల్లులు కూడా కట్టించి ఇస్తమన్నరు. ఇప్పుడు డీడీఏ వోళ్లు ఈ స్థలం రహేజా కంపెనీకి అమ్మిన్నరంట. మాకు తెల్వనే తెల్వదు. వాళ్లేమో మీకు ఇండ్రు కట్టిస్తం ఈడి నుంచి పొమ్మటున్నరు. అక్కడ చూస్తే చిన్నచిన్న ఇల్లులు ఉన్నయి. 
 
 మా కాలనీల ఉండేటోళ్లలో సగం మందికే కాగితాలున్నయని చెబుతున్నరు. మిగిలినోళ్లకు ఆధారం పోతుంది. ఇప్పటికే ఇక్కడ నుంచి ఖాళీ చేసిపోయిన పక్క సమాజమోళ్లలో 30 కుటుంబాలకు ఇళ్లు ఇయ్యలేదు. అడి గితే మీకు కాగితాలు లేవన్నరు. ఇక్కడ అంతకు మందు ఉన్న ఇళ్లు తాళాలేసిండ్రు. మేం ఇక్కడి నుంచి కదిలితే రేపు మా పరిస్థితి ఏంది ? డీడీఏ సార్లు, లీడర్లను కలిసినం. ఎవరూ పక్కాగా చెప్తలేరు. కాగితాలేమీ ఇవ్వట్లేరు.   14 అంతస్తులు కట్టిస్తమంటున్నరు. వాటిల్లో ఉండుండు మాకు కష్టం. మరీ రెండునెల్ల నుంచి పోలీసులు రాత్రుళ్లు వస్తున్నరు. బెదిరిస్తున్నరు.  మొత్తం రూ.6.11 కోట్లకు రహేజావాళ్లకు స్థలం అమ్మిన్రంట. ఆ డబ్బులిస్తే మాకు స్థలం ఇస్తమంటున్నరు. తెలుగు నాయకులన్నా మా బాధలు పట్టించుకోవాలె. మేం దీనిపై హైకోర్టులో కేసు వేసినం. ఈనెల 11న వస్తదంట. మాకు న్యాయం చెయ్యాలని సార్లకు మొక్కుకుంటున్నం’ అంటూ వివరించారు. 
 
 మేం ఎక్కడికి పోవాలే: కుష్టురోగుల ఆవేదన
 కట్‌పుత్లీ కాలనీలోనే దాదాపు 50 మంది తెలుగువారు కుష్టురోగంతో బాధపడుతున్నారు. వీరంతా ఎన్నోఏళ్లుగా కుటుంబాలతో కలిసి ఇక్కడే నివసిస్తున్నారు. జబ్బులున్న తమను సాధారణంగా ఉన్నవారితో కలుపుకోరని, మేం వేరుగా ఒక్కచోట బతుకుతున్నామని స్థానికుడు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శరణార్థుల కాలనీలో ఏర్పాటు చేసిన వసతుల మధ్య తాము బతకలేమని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. స్థానికంగా 1984లో స్థాపించిన లోక్‌మాతా కుష్టు ఆశ్రమంలో తాము తలదాచుకుంటున్నట్టు తెలిపారు. తెలిసినవారు దయతలిచి ఇచ్చే విరాళాలు, సహాయంతోనే తాము జీవిస్తున్నామని, ఇప్పుడు ఇక్కడి నుంచి కదిలితే చెల్లాచెదురవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 గుట్టలు సదును చేసుకున్నం  -గురువయ్య
 మేం కొత్తల వచ్చినప్పుడు అంతా గుట్టలు, బొందలే ఉండే. అంతా సదును చేసుకొని గుడిసెలు ఏసుకున్నం. ఇప్పుడు ఈ రూపుకి వచ్చింది. మాకు కరెంట్, నీళ్లు అన్నీ వచ్చి కాస్త మంచిగుండే సరికి మళ్ల పొమంటున్నరు. ఈడ నుంచి ఏడికి పోవాలె?  ఎట్ల బతకాలె? అధికారులే చెప్పాలె.
 
 నెల నుంచి తిండీ తిప్పల్లేవు -శకుంతల
 మేం ఈడ ఉండబట్టి 50 ఏండ్లు కావస్తుంది. నాభర్త, అత్త అంతా ఈడ బతికి.. ఈడనే పోయిండ్రు. కూలీనాలీ చేసుకొని బతికేటోళ్లం. ఇండ్లు కూలగొడతమని బెదిరిస్తున్నరు. రాత్రుళ్లు పోలీసోళ్లు వచ్చిపోతున్నరు. ఎప్పుడు ఎవరొస్తరో అని పనులు వదిలిపెట్టి ఇండ్లకాన్నే ఉంటున్నం. తిండీతిప్పలుగూడ లేవు.
 
 ఏడికిపోవాలే? -సంతోష
 40 ఏళ్ల నుంచి ఈడ ఉంటున్నం. ఇప్పుడు రహేజోళ్లకి అమ్మినం పొంమంటున్నరు. అమ్మిన సంగతి కూడా మాకు తెల్వదు. ఇల్లు కట్టిస్తమని చెపుతున్నరు. మాకు నమ్మకం ఎట్ల. ఈడ మాకు ఇండ్లు కట్టిస్తమని మా ఎంపీ మాకెన్ అంతా చెప్పిండ్రు. ఇప్పుడు కాళీ చెయ్యమంటున్నరు.
 
 ఈడనే సస్తం
 -కమల
 గుంటలు పూడ్సుకొని, కంపచెట్లు కొట్టి సాపు చేసుకున్నం. గుడిసెలు ఏసుకున్నం. ఏండ్ల సంది మా పిల్లలు జల్లలు అంతా ఈడనే బతికినం. ఇప్పుడు కాళీ చెయ్యమంటే ఏడికి పోవాలి. ఈడ్నే పుట్టినం. ఈడ్నే సస్తం. కాళీచేసేది లేదు. ఈడ నుంచి అడుగు బయట పెడితె బతకడం కష్టం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement