పొరపాటు చేశాను.. సరిదిద్దుకుంటా: సీఎం
న్యూఢిల్లీ: వరుస ఓటములతో ఢీలాపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన పొరపాట్లను అంగీకరించారు. పరాజయాలపై ఆత్మపరిశీలన చేసుకుని, తప్పులను సరిదిద్దుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేయడం వల్లే ఆప్ ఓటమి చవిచూసిందని ఆయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో ఆప్ పరాజయం పాలైంది. తాజాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆప్‌కు ఓటమి తప్పలేదు. ఎంసీడీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల తర్వాత కేజ్రీవాల్ ఓటమిని అంగీకరిస్తున్నట్టు చెప్పారు.
'గత రెండు రోజులుగా ఆప్ కార్యకర్తలు, ఓటర్లతో మాట్లాడాను. వాస్తవమేంటన్నది తేలింది. మనం కొన్ని పొరపాట్లు చేశాం. ఆత్మపరిశీలన చేసుకుని, తప్పులను సరిదిద్దుకోవాలి. మూలాల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆషామాషీగా తీసుకోరాదు. ఓటర్లకు, కార్యకర్తలకు రుణపడి ఉన్నాం' అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మహానగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 270 సీట్లకు గాను బీజేపీ 181 గెల్చుకోగా, ఆప్ 48, కాంగ్రెస్ 30 సీట్లతో సరిపెట్టుకున్నాయి.