కోలార్ కలెక్టర్ బదిలీ | Kolar transferred to the collector | Sakshi
Sakshi News home page

కోలార్ కలెక్టర్ బదిలీ

Published Thu, Oct 30 2014 5:35 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Kolar transferred to the collector

  • ఇసుక మాఫియాపై  ఉక్కుపాదం మోపినందుకు బహుమానం
  •  ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్  
  •  కోలార్ ప్రజల నిరసన
  •  నేడు జిల్లా బంద్
  • కోలారు : అవినీతికి తలొంచకుండా, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీని కానుకగా అందజేసింది. ఇసుక మాఫియాతో పాటు స్థానిక నేతల ఒత్తిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. కోలారు జిల్లాలోని ఇసుక మాఫియాను అరికట్టడంలో తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్లిన కలెక్టర్ డీకే రవిని  బదిలీ చేస్తూ రాష్ట్ర  ప్రభుత్వం  బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ రవిని రాష్ట్ర వాణిజ్య  పన్నుల అదనపు కమిషనర్‌గా నియమించింది. బీబీఎంపీలో  విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి కేవీ తిలక్‌చంద్రను  కోలారు కలెక్టర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో కోలారు సీఈవో వినోత్ ప్రియను బదిలీ చేసి సకాల అదనపు డెరైక్టర్‌గా నియమించింది. కోలారు సీఈవోగా మంజునాథ్‌ను  నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  
     
    పంతం నెగ్గించుకున్న ప్రజాప్రతినిధులు
     
    కలెక్టర్ రవి తమకు కొరకాని  కొయ్యగా తయారయ్యాడని భావించిన  కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు కలెక్టర్‌ను బదిలీ చేయించడానికి కంకణం కట్టుకుని ఎట్టకేలకు విజయం సాధించారు. ఇసుక మాఫియాను అరిక ట్టడంతో పాటు భూ మాఫియాపై ఉక్కుపాదం మోపి ఆక్రమణలు తొలగిస్తూ వస్తున్న కలెక్టర్ చర్యలు కొంతమందికి  నచ్చలేదు. కలెక్టర్ వద్ద తమ మాట చెల్లుబాటు కాదని భావించిన నాయకులు ఆయనను  ఇక్కడి నుంచి బదిలీ చేయించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. జిల్లాలోని  ప్రజాప్రతినిధులు కొంతమంది ముఖ్యమంత్రి వద్ద  కలెక్టర్‌ను బదిలీ చేయాలని   తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి సఫలమయ్యారు. గత కొద్ది రోజుల క్రితమే   కోలారు కలెక్టర్‌ను బదిలీ  చేసేది లేదని  రాష్ట్ర  ముఖ్యమంత్రి  సిద్ధ రామయ్య   మాటలు  వ్యర్థ  మయ్యాయి.  కలెక్టర్‌ను  జిల్లా  నుంచి  బదిలీ  చేయ కూడదని  ప్రజా  సంఘాలు,  రైతు సంఘాలు   పెద్ద  ఎత్తున  చేపట్టిన  ఆందోళనకు   విలువ  లేకుండా  పోయింది.
     
    అవినీతికి తావు లేకుండా....


    కోలారు  కలెక్టర్‌గా  గత సంవత్సరం  ఆగస్టు  నెలలో  బాధ్యతలు   చేపట్టిన  నాటి  నుంచే  కలెక్టర్  రవి  అవినీతికి  తావులేని  పారదర్శక మైన పాలనను అందించేందుకు కృషి చేశారు.  జిల్లాలో  యథేచ్ఛగా  సాగుతున్న  ఇసుక  అక్రమ  రవాణాను  అడ్డుకున్నారు. కలెక్టర్  తీసుకున్న   చర్యల  వల్ల  జిల్లాలో  పూర్తిగా  ఇసుక  అక్రమ రవాణా  నిలిచి  పోయింది.
     
    దీన్ని జీర్ణించుకోలేని  ఇసుక మాఫియా  అప్పుడే  కలెక్టర్‌ను  బదిలీ    చేయించడానికి  ప్రయత్నాలు  చేసి  భంగపడ్డారు. పాలనను  ప్రజలకు  చేరువ  చేయలనే  సదుద్దేశంతో  కలెక్టర్   రవి  జిల్లాలో  రెవెన్యూ  అదాలత్ , పోడి అదాలత్  తదితర  వినూత్న  కార్యక్రమాలను  ప్రారంభించి  రైతుల  భూ సమస్యలను  సత్వరమే  పరిష్కరించారు. కలెక్టర్  ప్రారంభించిన  ఈ కార్యక్రమం  జిల్లా  ప్రజలను  ఎంతగానో  ఆకర్షించడమే కాకుండా  రాష్ట్ర  వ్యాప్తంగా  ఈ కార్యక్రమానికి  ప్రశంసలు  అందాయి.  
     
    భూమాఫియాపై  కన్నెర్ర  :

    ప్రభుత్వ  ఆస్తులను  ఆక్రమించుకున్న  భూ మాఫియాపై  కన్నెర్ర  చేసిన  కలెక్టర్  రవి  ఆక్రమణల  స్వాధీనానికి  నడుం బిగించారు.  ఇదే  కలెక్టర్  బదిలీకి  కారణ మయిందని  చెప్పవచ్చు. బంగారు పేటలో  కాన్ఫిడెంట్  గ్రూప్  సంస్థ  ప్రభుత్వ  భూమిని  ఆక్రమించుకుని  గోల్ఫ్‌కోర్సును  నిర్మించిందని  ఆ భూమిని స్వాధీనం  చేసుకోవడానికి  ఆక్రమణ దారులకు  నోటీసులు  జారీ  చేశారు. ఇది సహించని  భూ మాఫియాదారులు  తమ ప్రభావాన్ని  చూపించారు.  ప్రజా  ప్రతి నిధులపై  తీవ్ర  ఒత్తిడి  తీసుకు వచ్చి  కలెక్టర్‌ను  బదిలీ  చేయించారు. కలెక్టర్‌ను  బదిలీ  చేస్తే  ప్రజల  నుంచి  తీవ్ర  ప్రతిఘటన  ఎదురవుతుందని  భావించిన  ప్రభుత్వం  కలెక్టరే  బదిలీ  కోరుతూ  ఉత్తరం  రాశారని   ప్రచారం  చేయించడం గమనార్హం.
     
    నేడు కోలార్ జిల్లా బంద్

    జిల్లా  కలెక్టర్  డీ  కే  రవిని  ప్రభుత్వం  బదిలీ   చేయడాన్ని  నిరసిస్తూ వివిధ సంఘాలకు  చెందిన  కార్యకర్తలు  బుధవారం  సాయంత్రం  నగరంలోని  బస్టాండు  సర్కల్  వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్  బదిలీకి  కారకులైన  ప్రజా ప్రతినిధులను  దుమ్మెత్తి  పోశారు.  ప్రభుత్వం  వెంటనే  కలెక్టర్  బదిలీ  నిర్ణయాన్ని  వెనక్కు  తీసుకోకపోతే ఆందోళనను తీవ్ర తరం చేస్తామన్నారు.  కలెక్టర్ బదిలీని నిరసిస్తూ  అన్ని  సంఘటనలు  కలిసి  గురువారం  జిల్లా  బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆందోళనలో  బీజేపీ  నాయకులు, సీపీఐ, సీపీఎం, కేపీఆర్‌ఎస్, రైతు సంఘం, రక్షణా  వేదిక,  వివిధ  సంఘటనలకు  చెందిన  కార్యకర్తలు  పాల్గొన్నారు .

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement