
కొండెక్కనున్న కూరగాయలు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడంతో కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చే పరిస్థితి కనబడుతోంది.
ముంబై: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడంతో కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలొచ్చే పరిస్థితి కనబడుతోంది. వివిధ ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురవడంతో కూరగాయలు, పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది.
దీంతో వీటి ధరలు 30 శాతంమేర పెరిగే అవకాశముందని వాషిలో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) డెరైక్టర్ సంజయ్ పాన్సారే పేర్కొన్నారు. మరో 8 నుంచి 10 రోజుల్లో ధరలు పెరుగుతాయన్నారు. ‘నగరానికి వచ్చే పంట నాణ్యత కూడా తక్కువగా ఉంది. వేసవిలో ఎంతో డిమాండ్ ఉన్న ప్రఖ్యాతి చెందిన ‘కేసర్’ మామిడికి కూడా ఈ ఏడాది నష్టం వాటిల్లింద’ని వివరించారు. ద్రాక్ష, అరటి, దానిమ్మ పండ్లు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని తెలిపారు.
దీంతో తాము కూరగాయలు, పండ్లపై 30 శాతం ధరను పెంచాలని నిశ్చయించామన్నారు. అయితే ఎంతమేర ధర పెంచనున్నామో మరో ఎనిమిది నుంచి పది రోజుల్లో నిర్ధారిస్తామన్నారు. అయితే వేసవి కాలంలో చాలామంది పండ్లను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. వీటి ధరలు పెంచడంతో నగరవాసులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అకాల వర్షం కారణంగా ‘కేసర్’ మామిడి పండ్లపై ఈ ఏడాది తీవ్ర ప్రభావం చూపనుంది. ఔరంగాబాద్, లాతూర్ నుంచి పది టన్నుల వరకు ఈ మామిడి పండ్లు హోల్‌సేల్ మార్కెట్‌కి వస్తాయి. అయితే కోతకు వచ్చిన పండ్లపై వడగండ్ల వర్షం కురవడంతో పండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయ’ని ఆయన పేర్కొన్నారు.
లాతూర్ నుంచి టమాటాలు సరఫరా అవుతాయనీ, కీర దోసకాయలను షోలాపూర్ నుంచి, ఆకు కూరలు నాసిక్ నుంచి సరఫరా అవుతాయని కూరగాయల మార్కెట్ డెరైక్టర్ శంకర్ పింగ్లే అన్నారు. అకాల వర్షం ఆకుకూరలు, కూరగాయలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. మరో పది రోజుల్లో వీటి ధరలు పెరుగుతాయని ఆయన తెలిపారు. అయితే కూరగాయలను జారీ చేసే టెంపోలు, ట్రక్కుల సంఖ్య తగ్గేదాన్నిబట్టి వీటి ధరలను నిర్ణయిస్తామన్నారు. ఇదిలావుండగా తక్కువ నాణ్యత గల కూరగాయలు, పండ్లు మార్కెట్‌లోకి రావడంతో ప్రముఖ వ్యాపారస్తులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
ఈ విషయమై వాషిలోని ఏపీఎంసీకి చెందిన వ్యాపారి అజిత్ భోరే మాట్లాడుతూ...హోల్ సేల్‌లో ప్రస్తుతం టమాటాలు కిలో రూ.6లకు విక్రయిస్తున్నామన్నారు. అయితే మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఉండడంతో త్వరలోనే వీటికి కొరత ఏర్పడనుందన్నారు. దీంతో ధరలు పెరుగుతాయన్నారు.
రీటైల్ మార్కెట్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు కిలో చొప్పున (రూ.లలో)
ఉల్లిగడ్డ 16 ఆలు 20
టమాట 15 నిమ్మ (ఒక్కటి) 2
క్యాప్సికమ్ 60 క్యాబేజ్ 20
కాలిఫ్లవర్ 20 వంకాయలు 20
కీర దోసకాయ 20 క్యారెట్ 16
సోరకాయ 20 పచ్చి బఠాణి 30
బీట్‌రూట్ 30 అల్లం 100
మిరప 40 కాకరకాయ 40
బెండకాయ 40 చిక్కుడు 40