
కొండపైకి కొప్పరి
తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం మహా దీపోత్సవం కనుల పండువగా నిర్వహించనున్నారు.
- దీపోత్సవానికి మానవ రహిత విమానాలతో నిఘా
- 50 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
- 10 వేల మంది పోలీసులతో బందోబస్తు
- కొండపైన అగ్గిపెట్టె, సిగరెట్లు, టపాకాయల నిషేధం
తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం మహా దీపోత్సవం కనుల పండువగా నిర్వహించనున్నారు. మహా దీపాన్ని వెలిగించే రాగి రాక్షస కొప్పరిని బుధవారం ఉదయం ఆలయం నుంచి అరుణాచల కొండపైకి తరలించారు. అనంతరం స్వామి వార్లు ఆలయ మాడవీధుల్లో అశ్వ వాహనంపై ఊరేగారు.
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో పదోరోజు శుక్రవారం సాయంత్రం 2668 అడుగుల ఎత్తుగల కొండపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. దీని కోసం రాగి రాక్షస కొప్బరిని ఆలయ అధికారులు కొండపైకి తరలించారు. శుక్రవారం ఉదయం 4గంటలకే ఆలయ రాజ గోపురం ఎదుట భరణి దీపం వెలిగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మహా దీపాన్ని కొండపైన వెలిగిస్తారు.
ఇందు కోసం బుధవారం ఉదయం ఆరు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు, కలిగిన రాక్షస కొప్బరికి ఆలయ గోపురం సమీపంలోని నంది విగ్రహం వద్ద వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోపూజ చేసి కొప్పరిని ఆలయ ఏనుగు రుక్కు ఆశీర్వదించింది. అనంతరం సావల్‌పూండి గ్రామానికి చెందిన పారంపర్య వంశస్తులు 350 కిలోల బరువు కలిగిన రాగి రాక్షస కొప్పరిని మహా కొండపైకి తీసుకెళ్లారు. అన్నామలైయార్‌కు హరోంహరా అంటూ నామస్మరణం చేస్తూ 2,668 అడుగుల ఎత్తుగల కొండపైకి రాక్షస కొప్పరిని తీసుకెళ్లారు. మహా దీపానికి ఉపయోగించే వెయ్యి మీటర్ల గాడా వస్త్రం, 3500 కిలోల నెయ్యిని కొండపైకి తరలించారు.
నిషేధం
కొండపైకి అగ్గిపెట్టెలు, టపాకాయాలు, సిగిరెట్, సెల్‌ఫోన్ వంటి వస్తువులను తరలించకుండా నిషేధం విధించారు. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి పంపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల తొక్కి స లాట లేకుండా చర్యలు చేపడుతున్నారు. అంబులెన్స్, అగ్ని మాపక వాహనాల సిబ్బందిని అందుబాటులో వుంచారు.
అమ్మనియమ్మన్ గోపురం ద్వారా భక్తులు లోనికి రావాలి
కొండపై దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఆలయంలోని అమ్మనియమ్మన్ గోపురం దారిలో లోపలికి రావాలని కలెక్టర్ జ్ఞానశేఖరన్ తెలిపారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకుండా 60 మంది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు గుర్తింపు కార్డులు ఏర్పాటు చేసి నిఘా వుంచినట్లు తెలిపారు. భక్తులకు అక్కడక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని అదే విధంగా తాగునీటి వసతి, గిరివలయం రోడ్డులో అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
అశ్వ వాహనంపై ఊరేగిన చంద్రశేఖరుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం వినాయకుడు, చంద్రశేఖరుడు అశ్వ వాహనంలో మాడ వీధుల్లో ఊరేగారు. ఉదయం స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేసి అశ్వ వాహనంపై ఆశీనులు చేసి మాడ వీధుల్లో భక్తుల హరోం హరా నామస్మరణాల వధ్య ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వార్లకు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.
మానవ రహిత విమానాలతో నిఘా
దీపోత్సవానికి సుమారు 20 లక్షల మంది భక్తులు పాల్గొననున్నారని ఇప్పటికే 50 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా గిరివలయం రోడ్డులో 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పదివేల మంది పోలీసులతో బందోబస్తులో పాల్గొంటారని, 17 యూనిట్ల మహిళా పోలీ సులు బందోబస్తులో ఉంటారని ఎస్‌పి ముత్తరసి తెలిపారు. అదే విధంగా ఎక్కడా చోరీలు, ప్రమాదాలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లను ఆలయం గది నుంచే పరిశీలించనున్నారు.
కొండపైకి వెళ్లే భక్తుల బందోబస్తు కోసం 100 కమాండోలను రప్పించామన్నారు. పట్టణంలో 23 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఆలయ రాజ గోపురం పైనుంచి రెండు మానవ రహిత విమానాలతో ప్రత్యేక నిఘా ఉంచి వాటిని ఆలయ కార్యాలయం నుంచి పోలీసులు పరిశీలిస్తూ ఉంటారన్నారు. బందోబస్తుకు ఐజీ మంజునాథ, అడిషనల్ ఐజీ రాజంద్రన్ నేతృత్వంలో వేలూరు, విల్లుపురం, కాంచిపురం వంటి నాలుగు ప్రాంతాల నుంచి డీఐజీ లు, 14 మంది ఎస్పీలు, 22 మంది అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు మొత్తం పది వేల మంది తరలి రానున్నట్లు తెలిపారు.