
వారంతా పార్టీకంటే పెద్దవారు
అందుకే సమావేశానికి హాజరుకాలేదు
శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై కుమార వ్యంగాస్త్రం
బెంగళూరు : ‘వారంతా పార్టీకంటే పెద్దవాళ్లుగా ఎదిగిపోయారు. పార్టీ సమావేశానికి వస్తే ఎక్కడ తమ హోదా తగ్గిపోతుందో అని సమావేశానికి హాజరుకాలేదు’ అంటూ జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ సమావేశానికి జేడీఎస్‌కి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు హాజరుకాలేదని, వారి గురించి తానిప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. గురువారమిక్కడి ఓ ప్రైవేటు హోటల్‌లో జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ...‘సమావేశంలో పాల్గొంటే ఎక్కడ తమ హోదా తగ్గుతుందో అని కొందరు రాలేదు. ఇక హనుమాన్ జయంతి సందర్భంగా తాము సమావేశంలో పాల్గొనలేకపోతున్నామని కొందరు, అత్యవసర పనుల కారణంగా రాలేకపోతున్నామని మరికొందరు ముందుగానే నాకు సమాచారం అందించారు. అందువల్ల ఈ విషయంపై పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యం....
బెళగావిలో జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ముఖ్య అజెండాగా జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశం సాగింది. ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్క సభ్యుడు ప్రశ్నలను సంధించాలని ఈ సందర్భంగా కుమారస్వామి శాసనసభ్యులకు సూచించారు. అంతేకాక అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరు తప్పక హాజరుకావాలని కుమారస్వామి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని సమస్యలు, చెరకు మద్దతు ధర, రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని సమాచారం. ఈ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు హెచ్.ఎస్.శివశంకర్, డాక్టర్ శ్రీనివాస మూర్తి, భీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.