ట్యాబ్లెట్లు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించిన సర్కార్ ఈ మేరకు కార్మిక శాఖకు ఆదేశాలు అర్హుల వివరాలను సేకరించే పనిలో అధికారులు.
కార్మికుల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా ఆధునిక సాంకేతికతకు అలవాటుపడేలా చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. వీరికి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకానికి ఎంతమంది విద్యార్థులు అర్హులనే వివరాలను సమర్పించాలని కార్మిక శాఖను కోరింది. ఈ మేరకు భవన నిర్మాణం పనులు నిర్వహించే కార్మికుల పిల్లలతో పాటు మథాడి (కూలీ), డొమాస్టిక్ హెల్పర్ల చిన్నారుల బయోడేటా సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అయితే ఈ మూడు బోర్డుల్లో రిజిస్ట్రేషన్ నమోదుచేసుకున్న ఉద్యోగుల పిల్లలకు మాత్రమే ఈ పరికరాలను పంపిణీ చేస్తామని కార్మిక శాఖ అధికారి తెలిపారు. అయితే ఈ ప్రణాళిక ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. కార్మికుల పిల్లల్లో నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు దోహదపడుతాయన్న ఉద్దేశంతోనే అందజేసేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న కార్మికుల పిల్లలు టాబ్లెట్ పొందేందుకు అర్హులని, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లతోపాటు ఇంటర్నెట్ కనెక్షన్‌లను కూడా ఇస్తామని తెలిపారు. ఈ పరికరాలను పొందేందుకు అర్హత కలిగిన పిల్లలు ఊహించినదానికంటే అధిక సంఖ్యలో ఉండటంతో తాము ప్రాధాన్యతను బట్టి వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. వృత్తి విద్యా కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ఎంతో దోహదపడుతాయి
పిల్లల ఉత్సాహాన్ని పెంచేందుకు ఈ పథకం దోహదపడుతుందని కార్మిక శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరో మూడు వారాల్లో ఈ పనులు పూర్థిస్థాయిలో ప్రారంభమవుతాయన్నారు. ఇదిలావుండగా మహారాష్ట్రలో నిర్మాణాలు, డొమెస్టిక్, మథాడికి చెందిన బోర్డులలో దాదాపు ఆరు లక్షలకు పైగా కార్మికులు నమోదు చేసుకున్నారు. డొమెస్టిక్ వెల్ఫేర్ బోర్డు మినహా మిగతా ఈ రెండు బోర్డులకు సంక్షేమ నిధుల ద్వారా రుణాలు వస్తున్నాయి. దీంతో ఈ రెండు బోర్డులు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నాయని కార్మిక శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
కార్మికుల పిల్లలకు ల్యాప్‌టాప్‌లు
Published Tue, Oct 22 2013 12:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
Advertisement
Advertisement