నో డౌట్
కాంగ్రెస్ పార్టీ చివరిముఖ్యమంత్రి సిద్ధరామయ్యయే
పరిషత్ విపక్షనాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప
బెంగళూరు : ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకు సంబంధించి చివరి ముఖ్యమంత్రిగా మారనున్నారని శాసనమండలి విపక్షనాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. సువర్ణ విధానసౌధాలో మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అక్రమాలకు కొదువే లేదన్నారు. దేశానికి తలమానికమైన లోకాయుక్త సంస్థ కూడా అవినీతిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వందల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్తను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఏర్పాటైన రాష్ట్ర సాంఘిక సం క్షేమ శాఖలో రూ.వందల కోట్ల విలువ చేసే అక్రమాలు చోటు చేసుకున్నా దర్యాప్తునకు అధికార కాంగ్రెస్ పార్టీ అంగీకరించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇక అధికారంలోకి రావడానికి ముందు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని చెప్పిన కాం గ్రెస్ పార్టీ ఈ విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయాల న్నింటినీ ప్రజలు నిషిత దృష్టితో గమనిస్తున్నారని తెలిపారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. ఇక ఎప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదని పేర్కొన్నారు.