రుణమాఫీ సాధ్యం కాదు
- ప్రతిపక్షాలకు తేల్చిచెప్పిన ప్రభుత్వం
- రూ.3.30 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయలేమని స్పష్టీకరణ
- ఏటా రూ. 24 వేల కోట్లు వడ్డీ రూపంలోనే చెలిస్తున్నామన్న మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే
- రెండు సార్లు వాయిదా పడిన శాసనసభ
- ప్రతిపక్షాల ఆందోళన లతో అట్టుడికిన మండలి
ముంబై: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజూ వాడీవేడిగా సాగాయి. ప్రతిపక్షాల ఆందోళనలు, ప్రభుత్వ ఎదురుదాడి మధ్య సభ గురువారానికి వాయిదా పడింది. రెండు రోజుల పాటు సభను బిహ ష్కరించిన ప్రతిపక్షాలు మూడో రోజైన మంగళవారం రైతు రుణమాఫీపై పట్టుబట్టాయి. రుణమాఫీపై ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని పట్టుబట్టాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం, రాష్ట్రంలో దాదాపు రూ.3.30 లక్షల కోట్ల మేర రైతు రుణాలున్నాయని, అంత పెద్ద మొత్తంలో రుణాలు మాఫీ చేయడం సాధ్యమయ్యేపని కాదని అసెంబ్లీలో స్పష్టం చేసింది. ప్రతిపక్షాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన మంత్రులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్నాభావ్ సాథే కార్పొరేషన్ అవినీతి గురించి లేవనెత్తారు.
అన్నాబావ్ కార్పొరేషన్ అవినీతిపై విచారణ చేపట్టాలని, నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ సభ్యుడు సంజయ్ కుటే ప్రభుత్వాన్ని కోరారు. దీనికి వివరణ ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే, కార్పొరేషన్ అవినీతికి సంబంధించి నివేదిక ప్రభుత్వానికి అందిందని, కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. రైతు రుణాల మాఫీపై తన అశక్తతను బయటికి కనబరచకుండా, రూ.3.30 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయడం కష్టమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ‘రూ. 3.30 లక్షల కోట్ల రుణాలకు గాను ఏడాదికి రూ. 24 వేల కోట్లు వడ్డీ రూపంలోనే బ్యాంకులకు చెల్లిస్తున్నాం. రుణమాఫీ చేయాలని డిమాండు చేస్తున్న వాళ్లంతా అన్నాబావ్ కార్పొరేషన్ నిధులను మళ్లించి అక్రమానికి పాల్పడినవారే. వర్షాకాల సమావేశాలు ముగిసేలోపే వారిపై చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు పెడతాం’ అని ఖడ్సే చెప్పారు.
రెండు సార్లు వాయిదా
మిల్లు కార్మికులకు ఇళ్ల పంపిణీ, రైతు రుణ మాఫీపై ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ హరిబావ్ బగాడే క్వషన్ అవర్‌ను ప్రారంభించారు. ఎన్సీపీ సభ్యుడు జయంత్ పాటిల్ మాట్లాడుతూ, ‘ మిల్లు కార్మికులకు గత ప్రభుత్వమే లక్ష ఇళ్లు నిర్మించి సిద్ధం చేసింది. అయితే వాటిని లాటరీ రూపంలో లబ్ధిదారులకు అందజేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రైతు రుణమాఫీపై మాట మార్చిన ట్లే, మిల్లు కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం అదే తీరులో వ్యవ హరిస్తోంది’ అని ఆరోపించారు. ‘ఇళ్ల పంపిణీలో జాప్యం వహిస్తూ ప్రభుత్వం మిల్లు కార్మికులను బాధకు గురిచేస్తోంది. రాను రాను రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కాని రైతు రుణమాఫీపై ప్రభుత ్వం స్పష్టత ఇయ్యడం లేదు’ అని శాసనసభ ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ ఆరోపించారు. ‘ఎల్‌బీటీ రద్దు చేసినందుకు గాను రూ.2000 కోట్లు నష్ట పరిహారం ప్రకటించిన ప్రభుత్వం, రైతు ఆత్మహత్యలు చేసుకుని తనువుచాలిస్తున్నా చలించడం లేదు’ అని మండిపడ్డారు.
మండలిలోనూ రుణమాఫీ రభస
శాసనమండలిలోనూ రైతు రుణమాఫీపై తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు పట్టువీడక పోవడంతో మండలిని ఒక రోజు పాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. తమ డిమాండ్లను డిమాండ్లను అంగీకరించే వరకు సభను జరగనివ్వబోమని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. రైతు రుణాలు మాఫీ చేయడం సాధ్యమయ్యే పనికాదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తేల్చిచెప్పిన నేసథ్యంలో, సీఎం తన మాటలు వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
శివసేన వైఖరేంటి..?
‘కొద్ది రోజుల క్రితం యావత్మల్ జిల్లాకు చెందిన మహిళా రైతుతో మాట్లాడిన సీఎం, ఆమెకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత విశ్వసనీయత కలిగి ఉండవచ్చు. కాని ఆ ముఖ్యమంత్రి విశ్వసనీయతపైనే అసెంబ్లీలో దాడి జరుగుతోంది. దీనిపై స్పందించరా’ అని ఎన్సీపీ నేత సునీల్ తట్కరే ప్రశ్నించారు. ‘శివసేన ప్రస్తుతం ప్రభుత్వ భాగస్వామి. సభలో రైతు రుణమాఫీ చర్చ ప్రారంభం కాకముందే తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలి. రుణమాఫీ చేయాలని సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండు చేశారు. అలాగే ఆ పార్టీ కూడా సభలో డిమాండు చేయాలి’ అని ఠాక్రే పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంఘీభావంగా నినాదాలు చేసిన ప్రతిపక్ష సభ్యులు, సభ వెల్‌లోకి దూసుకె ళ్లి రైతులకు న్యాయం చేయాలని డిమాండు చేశారు.
అంతా మీ వల్లే..: ఏక్‌నాథ్ ఖడ్సే
ప్రతిపక్షాల ఆందోళన మధ్య తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే కోరారు. ‘గత ప్రభుత్వ అవినీతి రాష్ట్రమంతటా విస్తరించింది. అన్ని కార్పొరేషన్లలోనూ ఆ అవినీతి వేళ్లూనుకుని పోయింది. కాని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీల సభ్యులు రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు’ అని ఖడ్సే ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలతో ప్రతి పక్షాలు ఆందోళన తీవ్రతరం చేశాయి. దీంతో చైర్మన్ సభను తొలుత 50 నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు మళ్లీ అందోళన చేపట్టడంతో మరో 15 నిమిషాలు వాయిదా వేశారు, అనంతరం కూడా 10 నిమిషాలు వాయిదా వేశారు. ఆందోళనలు తగ్గకపోవడంతో చైర్మన్ జానర్దన్ చంద్రుకర్, సభను గురువారానికి వాయిదా వేశారు.