హోరెత్తిన చాందినీచౌక్
Published Wed, Apr 2 2014 11:00 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ప్రచారంతో నగరంలోని చాందినీచౌక్ బుధవారం హోరెత్తిపోయింది. ఈ నియోజకవర్గం నుంచి హేమాహేమీలు బరిలోకి దిగడంతో ఇక్కడి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. బీజేపీ నుంచి డాక్టర్ హర్షవర్ధన్, కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అశుతోష్ పోటీ పడుతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పరిస్థితి హర్షవర్ధన్, అశుతోష్‌లు బరిలోకి దిగడంతో ముక్కోణపు పోటీగా మారిపోయింది.
ఎవరికివారే తమ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఆయ పార్టీల అధిష్టానాలు కూడా ఇక్కడి గెలుపుపై దృష్టిసారించాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ మంత్రిగా కొనసాగుతున్న కపిల్ సిబల్ ఇక్కడ పరాజయం పాలైతే అది పార్టీకే చెడ్డపేరు తెస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన ముద్రవేసిన డాక్టర్ హర్షవర్ధన్ గెలుపును కూడా ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. ఇక సినియర్లపై గెలిచి సత్తాచాటాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అశుతోష్‌ను గెలిపించి, మరోసారి కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలనుకుంటోంది. ఇలా ఎవరికివారే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అదే స్థాయిలో ప్రచారానికి దిగుతుండడంతో ఈ నియోజకవర్గంలోని ప్రతి వీధి పార్టీల నినాదాలతో హోరెత్తిపోతోంది.
ముస్లింలదే కీలక పాత్ర..
దాదాపు 14 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా సుమారు 20 శాతం ఉంటుంది. దీంతో ముగ్గురు అభ్యర్థులు కూడా ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ కాస్త ముందున్నా, ఆప్ రంగప్రవేశంతో ముస్లిం ఓట్లు చీలే అవకాశముందని, ఇది పరోక్షంగా బీజేపీకి అనుకూలిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ మాత్రం ముస్లిం ఓట్లపై పెద్దగా ఆశపెట్టుకోకున్నా హర్షవర్ధన్ ఇమేజ్‌తోపాటు మోడీ చరిష్మాతో కొన్ని ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి పడే అవకాశముందని చెబుతున్నారు.
Advertisement
Advertisement