కపిల్ సిబల్ డబ్బులు పంచారు
Published Wed, Apr 9 2014 10:38 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, న్యూఢిల్లీ: చాందినీచౌక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మనుషులు డబ్బులు పంచారని ఆయన ప్రత్యర్థి, ఆప్ నేత అశుతోష్ ఆరోపించారు. కపిల్ సిబల్ మనుషులు డబ్బు పంచడాన్ని తన భార్య స్వయంగా చూసిందని ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో తక్షణం జోక్యం కలిగించుకోవాలని సిబల్ అభ్యర్ధిత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆశుతోష్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని కపిల్ సిబల్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై ఎన్నికల కమిషన్ ఆశుతోష్‌కు నోటీసు జారీ చేసింది. ఏ ఆధారాలతో సిబల్‌పై ఆరోపణలు చేశారో తెలపాలని ఎన్నికల కమిషన్ అశుతోష్‌ను ఆదేశించింది.
కపిల్ సిబల్ డబ్బులతో ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల కమిషన్ సిబల్ పై కేసు నమోదుచేసి, ఎన్నికల్లో పోటీచేయకుండా సిబల్‌పై నిషేధం విధించాలని అశుతోష్ ట్విటర్‌లో పేర్కొన్నారు. తనకు డిపాజిట్ కూడా దక్కద న్న విషయాన్ని కపిల్ సిబల్ గుర్తించారని, అందుకే డబ్బులతో గెలవాలనుకుంటున్నారని కానీ ప్రజలు మేల్కొన్నార ని ఆశుతోష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. డబ్బుతో ఓట్లు కొనగలమని అనుకునే సిబల్ వంటి కొందరు నేతల వల్ల భారత ప్రజాస్వామ్యానికి చెడ్డపేరు వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కపిల్ సిబల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని అశుతోష్ తెలిపారు. ఇది అధికారానికి, నిజాయతీకి మధ్య జరుగుతోన్న ఎన్నిక అని, నిజాయతీ గెలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. సిబల్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని అశుతోష్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహా ఇచ్చారు.
మంగళవారం చాందినీచౌక్‌లో తన భార్య ప్రచారం చేస్తున్నప్పుడు కపిల్ సిబల్ మనుషులు డబ్బులు పంచడం చూసిందని ఆయన తెలిపారు. కపిల్ సిబల్ ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నికల కమిషన్ అశుతోష్‌కు నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరింది. కపిల్ సిబల్ తనపై అశుతోష్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రజల మద్దతు కోల్పోయినవారు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తుంటారని ఆయన అన్నారు. ఇది రాజకీయాలలో కొత్తగా వచ్చినవారు చేసే ఆరోపణలని ఆయన కొట్టివేశారు. అశుతోష్ ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉందని, అతణ్ని చూస్తే తనకు జాలేస్తోందన్నారు. ఆరోపణల్లో నిజం ఉంటే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Advertisement