ఆ లాటరీ.. ఓ మిస్టరీ..! | Lottary policy in illegations on plats allocation | Sakshi
Sakshi News home page

ఆ లాటరీ.. ఓ మిస్టరీ..!

Published Sun, Oct 9 2016 4:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

ఆ లాటరీ.. ఓ మిస్టరీ..!

ఆ లాటరీ.. ఓ మిస్టరీ..!

- తమవారికి కోరుకున్న చోట ప్లాటు
- సామాన్యులకు ఎక్కడపడితే అక్కడ
- అంతా పెద్దల కనుసన్నల్లో..
- లాటరీ మోసంపై రైతుల ఆగ్రహం

 
సాక్షి, అమరావతి బ్యూరో:
రాజధాని ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపుకు ప్రభుత్వం తీసుకొచ్చిన లాటరీ విధానంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి స్తున్నాయి. ఎవరికీ అన్యాయం జరక్కుండా ప్లాట్లు కేటాయిస్తున్నామని చెబుతూనే.. అధికార పార్టీ నేతలు, బంధువులు, మిత్రులకు కోరుకున్నచోట విలువైన ప్లాట్లు ఇస్తున్నారు. మిగిలిన వారికి మాత్రం అంతగా విలువ చేయని ప్లాట్లు ఎక్కడపడితే అక్కడ కేటాయిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. నిన్నటి వరకు ఆన్‌లైన్‌లో కనిపించిన యాజమాన్య పత్రాలు రెండు రోజులుగా అదృశ్యమవ్వడమే ఇందుకు నిదర్శనం. రాజధాని కోసం ప్రభుత్వం సమీకరణ పేరుతో భూములను లాక్కున్న విషయం తెలిసిందే.
 
 భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కింద కోరుకున్న చోట.. కోరుకున్నట్లు ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో నివాస యోగ్యమైనవి, వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. ఎకరం జరీబు భూమి ఇచ్చిన వారికి నివాసానికి వెయ్యి గజాలు, కమర్షియల్ కోసం 450 గజాల ప్లాట్లు.. మెట్ట భూమి ఇచ్చిన వారికి వెయ్యి గజాలు నివాసానికి, 250 గజాలు కమర్షియల్ ప్లాట్లు కేటాయిస్తున్నారు. రైతులు ఏ గ్రామంలో అయితే భూములు ఇచ్చారో అక్కడే కోరుకున్నట్లు ప్లాట్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి రైతులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అయితే వాస్తవంగా జరుగుతోంది మాత్రం పూర్తి విరుద్ధం.
 
తెరపైకి లాటరీ విధానం..
ఒకే ప్లాటును ఇద్దరు ముగ్గురు కోరుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో సీఆర్‌డీఏ అధికారులు లాటరీ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్ ద్వారా జరిగే ఈ లాటరీ విధానాన్ని జూన్ 25న సీఎం చంద్రబాబు తుళ్లూరులో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు తుళ్లూరు మండల పరిధిలో నేలపాడు, శాఖమూరు, అబ్బురాజుపాలెం, పిచ్చుకలపాలెం, దొండపాడు, ఐనవోలు గ్రామస్తులకు ప్లాట్లు కేటాయించారు. మిగిలిన గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు ప్రారంభం కావాల్సి ఉంది.
 
 ఇలా వెలుగులోకి..
ఇటీవల తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం వాసులకు సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద లాటరీ విధానం ద్వారా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదంతా ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రక్రియేనని భావించిన రైతులంతా ప్లాట్లు ఎక్కడపడితే అక్కడ ఇచ్చినప్పటికీ మారు మాట్లాడకుండా అధికారులు ఇచ్చిన పత్రాలు తీసుకుని వెళ్లిపోయారు. ఇదిలాఉండగా తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జమ్ముల వెంకటరమణయ్య ల్యాండ్ పూలింగ్‌కు 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్లాట్ల కేటాయింపులో 500 గజాల నివాస ప్లాట్లు రెండు, వెయ్యి గజాల నివాస ప్లాట్లు మరో రెండు, కమర్షియల్ కోసం 780 గజాల ప్లాట్లు రెండు కావాలని అడిగారు. ఆ మేరకు ఇతనికి కేటాయించిన ప్లాట్లన్నీ పక్కపక్కనే వాస్తు ప్రకారం, కోరుకున్న చోట, లాటరీకి సంబంధం లేకుండా ఉన్నాయి. సీఆర్‌డీఏ వేసిన లేఅవుట్లలో ఒక దానిలో వెయ్యి గజాల ప్లాట్లు నంబర్ 3, 4 కేటాయించారు. 500 గజాల ప్లాట్లను మరో లేఅవుట్‌లో 4, 5 నంబర్ ప్లాట్లు కేటాయించారు.
780 గజాల కమర్షియల్ ప్లాట్లను మరో లేఅవుట్‌లో 16, 17 నంబర్లలో కేటాయించటం గమనార్హం. మిగతా రైతులకు మాత్రం వీధిపోటు ఉన్నవి, వాస్తు బాగోలేని ప్లాట్లు ఎక్కడో దూరంగా కేటాయించారు. టీడీపీ నేత వెంకటరమణయ్యకు ఒకే చోట ప్లాట్లు కేటాయించిన విషయం బయటకు పొక్కటంతో విద్యావంతులైన కొందరు సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లోకి వెళ్లారు. అందులో ఉంచిన భూ యాజమాన్య పత్రాలను బయటకు తీశారు. అందులో వెంకటరమణయ్య ప్లాట్ల బాగోతం బయటపడింది. దీంతో సీఆర్‌డీఏ అధికారులు వెంటనే ఆన్‌లైన్‌లో ఉంచిన భూ యాజమాన్య పత్రాలన్నింటినీ తొలగించారు. ప్లాట్ల కేటాయింపంతా ముందే నిర్ణయిస్తున్నారని, లాటరీ విధానం అంతా మోసం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement