పెళ్లైన ఆర్నెల్లకే.. ప్రేమజంట ఆత్మహత్య
పెళ్లైన ఆర్నెల్లకే.. ప్రేమజంట ఆత్మహత్య
Published Mon, Nov 28 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
డిచ్‌పల్లి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆరునెలలు గడవక ముందే ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం అమృతపూర్‌లో సోమవారం ఉదయం వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న రాత్రి ఇంట్లో గొడవ జరగడంతో.. మనస్తాపానికి గురైన నవదంపతులు ఊరిబయట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. గ్రామానికి చెందిన గంగారాం(22) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రోజ(19)ను ప్రేమించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో.. కులాలు వేరు కావడంతో వారు పెళ్లికి ఒప్పుకోలేదు.
దీంతో ఈ ఏడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం అదే గ్రామంలో కాపురం పెట్టారు. కాగా.. గత కొన్ని రోజులుగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్యభర్తలు గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం చెరువు కట్టపై నుంచి వెళ్తున్న స్థానికులు గంగారాం మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించి బయటకు తీశారు. రోజా మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement